
కాళేశ్వరానికి జాతీయ హోదా రావొద్దనే సంబంధిత డాక్యుమెంట్లను కేంద్రానికి సీఎం కేసీఆర్ సబ్ మిట్ చేయలేదని అన్నారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం కరీంనగర్ లోని పార్టీ క్యాడర్ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్, ట్రైబల్ యూనివర్సిటీ, వైద్య యూనివర్సిటీల గురించి కేంద్ర బడ్జెట్లో పేర్కొనలేదని అన్నారు జీవన్ రెడ్డి. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాకారం కాకముందు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం కేవలం 38 వేల కోట్ల రూపాయలే అని… రీడిజైన్ పేరుమీద 80 వేల కోట్ల రూపాయలకు ప్రాజెక్టు ఖర్చు పెరిగిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి మొక్కుబడిగా లేఖ రాసారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావద్దనే సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆధిపత్యం పోతుందనే ఉద్దేశంతోనే సీరియస్ గా ప్రయత్నించడం లేదని చెప్పారు. అంతేకాకుండా ప్రాజెక్టు లోని తప్పులు బయటకొస్తాయని ప్రభుత్వం వెనుకంజ వేసిందని అన్నారు. ప్రజల ముందు మాత్రం కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించలేదని ఆరోపిస్తున్నారని తెలిపారు.