కాళేశ్వరం బాధ్యులను ఉరి తీయాలి : జీవన్ రెడ్డి

కాళేశ్వరం బాధ్యులను ఉరి తీయాలి : జీవన్ రెడ్డి

జగిత్యాల, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో లోపాలకు  కారకులైన వారిని ఉరి తీయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్​ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులను లీడర్లు డిజైన్ చేస్తే ఇట్లనే ఉంటుందని, దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. సుమారు రూ.ఇరవై వేల కోట్ల విలువైన ధాన్యాన్ని ఎలాంటి సెక్యూరిటీ లేకుండా గత ప్రభుత్వం మిల్లర్లకు అప్పజెప్పిందని ఆరోపించారు. మిల్లుల్లో జగిత్యాల జిల్లాకు సంబంధించిన  3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండాలని, తనిఖీ చేస్తే అందులో సగం కూడా ఉండదన్నారు. ఒక్కో మిల్లు నిర్వాహకుడు సుమారు రూ.4 కోట్ల ధాన్యాన్ని అమ్ముకున్నారన్నారు. ఆ ధాన్యాన్ని రికవరీ చేసి చీటింగ్ కేసులు నమోదు చేయాలని  డిమాండ్ చేశారు. 

దీనిపై ఇప్పటికే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో పాటు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. జిల్లాలో అక్రమ మైనింగ్​తో ఎర్ర మట్టి, ఇసుక తరలిపోతోందని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్​కుమార్​, కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్​చార్జి జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ సీనియర్ లీడర్​బండ శంకర్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ విజయ లక్ష్మి పాల్గొన్నారు.