కాంగ్రెస్ గ్యారంటీలకు సీఎం ఆమోదముద్ర వేసినట్లే : జీవన్ రెడ్డి

కాంగ్రెస్ గ్యారంటీలకు సీఎం ఆమోదముద్ర వేసినట్లే : జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారని, ఆయనకు కృతజ్ఞతలు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం జగిత్యాల ఇందిరాభవన్‌‌లో ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్‌‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రస్తుతం రూ.500కు సిలిండర్ అంటే సీఎం కేసీఆర్​రూ.400 అంటున్నారని,  ఇన్నేండ్లు అధికారంలో ఉండి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

కేసీఆర్ గత పదేళ్లలో ఇల్లు కట్టుకునేందుకు ఒక్కరికి కూడా గుంట స్థలం ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిధలైన నిరుద్యోగ యువతకు ఉద్యోగాల గురించి, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఒక్క హామీ ఇవ్వలేదన్నారు. ఉద్యోగస్తులు ఓపీఎస్ కావాలని ఉద్యమిస్తుంటే పదేళ్ల నుంచి నిద్రపోయి ఇప్పుడు పరిశీలించడానికి కమిటీ వేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు.  

ఈనెల 20న జగిత్యాలలో రాహుల్​గాంధీ పర్యటన ఉంటుందని విష్ణునాథ్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్​ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, రాజేందర్, రాజేందర్, అశోక్, మోహన్ పాల్గొన్నారు.