కేసీఆర్ 90 శాతం ఉద్యోగాలు ఆంధ్రోళ్లకే కట్టపెడుతుండు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేసీఆర్ 90 శాతం ఉద్యోగాలు ఆంధ్రోళ్లకే కట్టపెడుతుండు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

సీఎం కేసీఆర్‭కు ప్రచార ఆర్భాటం తప్ప రైతులకు చేసిందేమిటని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం పై నిరసన తెలపాలి అనుకుంటే బీఆర్ఎస్ లీడర్లు ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగాన్ని నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రైతాంగానికి రాయితీలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతు బంధు నెపంతో పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాల వడ్డీ మాఫీ, విత్తన రాయితీలు, వ్యవసాయ యాంత్రీకరణలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. నిరుపేదలకు ఉపాధి కల్పించడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ ప్రారంభించిందని గుర్తుచేశారు. రైతులకు కాంగ్రెస్ హయంలో 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇస్తే.. టీఆర్ఎస్ హయాంలో కరెంట్ పై కోతలు విధిస్తోందని జీవన్ రెడ్డి విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్ల మీద తెలంగాణ ప్రభుత్వం 30 వేల కోట్లు నష్టపోయిందని ఆయన చెప్పారు. 

రాజకీయ కాంక్షతో సీమాంధ్ర మెప్పు పొందేందుకు కృష్ణా నది జలాల దోపిడీకి కారణమయ్యారని సీఎం కేసీఆర్ పై జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతంలోని సీలేరు ప్రాజెక్టును ఆంధ్రలో కలిపినా హైదరాబాద్ సెటిలర్ల ఓట్ల కోసం మాట్లాడలేదన్నారు. సీమాంధ్ర మెప్పు కోసం తెలంగాణ హక్కులను కాలరాశారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్ జోన్ లో 90 శాతం ఉద్యోగాలు ఆంధ్రోళ్లకు కట్టపెడుతుండని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మలిదశ ఉద్యమం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉన్న నాలుగు రోజులైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని కేసీఆర్‭కు హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.