దేవుడి పేరు చెప్పి ఓట్లడుగుతున్న బీజేపీ : జీవన్ రెడ్డి

దేవుడి పేరు చెప్పి  ఓట్లడుగుతున్న బీజేపీ : జీవన్ రెడ్డి
  • రాముడికి, మోదీకి ఏం సంబంధం

హైదరాబాద్, వెలుగు: దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతున్నదని, మోదీకి రాముడికి ఏం సంబంధమని  కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  ప్రశ్నించారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో తిరుగుతూ కాంగ్రెస్​పై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం తర్వాత రాముడి కంటే మోదీని పూజించడం ఎక్కువైందన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

దేశం కోసం  ప్రాణాలు అర్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని, గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం అని అన్నారు. వికసిత్ భారత్ అనేది అంబానీ, అదానీ కోసమేనని, రైతుల కోసం కాదని విమర్శించారు. పెట్టుబడిదారుల రుణాలు మాఫీ చేశారని, రైతులకెందుకు చెయ్యరని ప్రశ్నించారు. రైతులకు రుణమాపీ చేసిన చరణ్ సింగ్ కు , వ్యవసాయ శాస్ర్తవేత్త స్వామినాథన్ కు భారతరత్న ఇవ్వడం మంచి పరిణామమని, పంటలకు కనీస మద్దతు ధర విషయంలో స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గినా డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించడం జీవన్ రెడ్డి మండిపడ్డారు. 

పొన్నంకు సంజయ్ క్షమాపణ చెప్పాలి 

మంత్రి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిపై ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, ముక్కు నేలకు రాయాలని డిమాండ్​ చేశారు. దేవుడి పేరు చెప్పి, జనాన్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని సంజయ్ ఎంపీ అయ్యాడని, ఈ ఐదేండ్లలో  కరీంనగర్, వేములవాడ, కొండగట్టుకు ఆయన ఏం చేశాడో చెప్పాలన్నారు. బీజేపీ యాత్రలకు స్పందన లేకపోవడంతో సంజయ్ ఇలా మాట్లాడుతున్నాడన్నారు.