పోలీసుల వ్యవహార శైలిపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తా : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

పోలీసుల వ్యవహార శైలిపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తా : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : తెలంగాణ పోలీస్ అధికారుల వ్యవహార తీరుపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిష్పక్షపాతంగా.. రాజకీయాలకు అతీతంగా.. ఎన్నికల కమిషన్ పరిమితులకు లోబడి ప్రభుత్వ అధికారులు విధులు నిర్వర్తించాలని చెప్పారు. రాజకీయ అనుబంధ సేవా సంస్థ అయిన ఎల్.ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తో కలిసి పోలీసులు కార్యక్రమాలు నిర్వహించడంపై జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎల్ఎమ్ కొప్పుల సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా నిర్వహించాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను జిల్లా పోలీస్ శాఖ అధ్వర్యంలో ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. 

స్వయంగా జిల్లా ఎస్పీ వాల్ పోస్టర్ ను రిలీజ్ చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. వాల్ పోస్టర్ పై పోలీస్ లోగో.. ఎల్ ఎమ్ కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ లోగో ప్రింట్ చేశారంటూ తప్పుపట్టారు. పోలీస్ శాఖ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ట్రైనింగ్ ఇవ్వడం వారి బాధ్యత అని, దానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాజకీయ సంస్థకు సంబంధం లేకుండా ప్రభుత్వ అధికారులు సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు.

ఎన్నికలకు ముందు పోలీస్ శాఖ రాజకీయ పార్టీ సమన్వయంతో సేవా కార్యక్రమాలు చేయడం సరికాదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పోలీస్ శాఖ అధ్వర్యంలో  ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని, రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ ఎల్ ఎమ్ కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం తన రాజకీయ చరిత్రలో ఎక్కడా చూడలేదన్నారు. ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించొద్దు అనేది తమ అభిప్రాయం కాదని స్పష్టం చేశారు.