రాష్ట్రంలో కరువుకు కేసీఆరే కారణం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాష్ట్రంలో కరువుకు కేసీఆరే కారణం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్​కు సాగునీరు అందకపోవడానికి, కరువు పరిస్థితులకు కేసీఆరే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ మీటింగ్​లో ఆయన ఏం మాట్లాడిండో ఆయనకైనా అర్థమయిందా? అని ఆయన ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీ భవన్​లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్రాజెక్టు పవర్ కొనుగోలుపై జ్యుడీషరీ ఎంక్వయిరీ వేయడంతో కేసీఆర్ పరేషాన్ లో ఉన్నడని, అందుకే మీటింగ్​లో ఫ్రస్టేషన్​లో మాట్లాడారని అన్నారు. మాట్లాడే భాష గురుంచి కేసీఆర్ చెప్పటం హ్యాస్యాస్పదంగా ఉందన్నారు. అలాంటి భాష తమకు రాదన్నారు. రేవంత్​ మాట్లాడుతుంటే కేసీఆర్ కు చెవ్వుల్లో సీసం పోసినట్లు ఉందని జీవన్ రెడ్డి అన్నారు.  ఇరిగేషన్, కృష్ణజలాలపై చర్చ టైమ్ లో అసెంబ్లీకి రాకుండా ఇప్పుడు టీవీ చర్చలకు వెళతానని అంటుండని, ఆయన్ని ఎవరూ ఆపడం లేదని జీవన్ రెడ్డి తెలిపారు.  

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తరు

పొరపాటున బీజేపీ మళ్లీ మూడో సారి అధికారంలోకి వస్తే.. అన్ని రిజర్వేషన్లు ఎత్తేస్తారని జీవన్ రెడ్డి ఆరోపించారు. అమిత్ షా సైతం కిషన్ రెడ్డిలా పాత స్పీచ్ మాట్లాడిండన్నారు. రాజ్యాంగాన్ని లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జాతీయ పార్టీల కేంద్ర కార్యాలయాలు ఢిల్లీలో ఉంటాయని అందుకే వెళ్తున్నామని, అందులో తప్పేముందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.