కాంగ్రెస్తో పోల్చుకునే నైతికత టీఆర్ఎస్, బీజేపీలకు లేదు : జీవన్ రెడ్డి

కాంగ్రెస్తో పోల్చుకునే నైతికత టీఆర్ఎస్, బీజేపీలకు లేదు : జీవన్ రెడ్డి

జగిత్యాల : అధికార దుర్వినియోగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ తో పోల్చుకునే నైతికత టీఆర్ఎస్, బీజేపీలకు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసిన ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చేందుకే నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ పనిముట్లు, విత్తన సబ్సిడీలు నిలిపేసి కేవలం రైతు బంధు ఇస్తున్నారని మండిపడ్డారు. తన చేతుల్లోలేకపోయినా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ చెబుతున్నాడని, జనాభా దామాషా ప్రకారం వారికి బడ్జెట్ కేటాయించే అధికారం మాత్రమే ఆయనకు ఉందని అన్నారు. కేసీఆర్కు జర్నలిస్టుల ఉసురు తగులుతుందని విమర్శించారు.

రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంపై జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టుకోకుండా అవసరమైన పోస్టులు కూడా భర్తీ చేయాలని అన్నారు. గతంలో ఉన్న ఈఎన్ టీ, డయాలసిస్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సేవలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జిల్లాలో 5 డయాలసిస్ యూనిట్లు మాత్రమే ఉన్నాయన్న జీవన్ రెడ్డి.. ధర్మపురి, కోరుట్లలోనూ వాటిని ప్రారంభించాలని అన్నారు.