అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాన్ని పెట్టండి

అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాన్ని పెట్టండి
  • స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్​కు ఎమ్మెల్సీ కవిత వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 11న పూలే జయంతిలోగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి బుధవారం స్పీకర్​కు కవిత వినతి పత్రం అందించారు. మహోన్నత వ్యక్తుల విగ్రహాలను అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాల్సిన అవసనరం ఉందన్నారు.

 పూలే విగ్రహ ఏర్పాటుపై గతేడాది జనవరి 21న కూడా లేఖ ఇచ్చామని గుర్తుచేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఉండాలన్నది వివిధ సామాజిక సంస్థలు, బీసీ సమాజపు చిరకాల కోరికని, ఈ విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతుందన్నారు. వెంటనే విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలను మొదలుపెట్టాలని కోరారు. స్పీకర్ ను కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కాలేరు వెంకటేశ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారు లక్ష్మా రెడ్డి , యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్ల శివ శంకర్ , జాగృతి నాయకులు శ్రీధర్ రావు, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకుడు అలకుంట హరి తదితరులు పాల్గొన్నారు.