నేడు ఈడీ ముందుకు కవిత

నేడు ఈడీ ముందుకు కవిత
  • ఇయ్యాల వెళ్లనున్న మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు
  • 11 గంటలకు ఈడీ ఆఫీసుకు కవిత.. పిళ్లైతో కలిపి విచారణ!

హైదరాబాద్, వెలుగు: 
ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసంలో బస చేస్తున్న ఆమె ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు చేరుకోనున్నారు. కవితపై ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. మరికొంత మంది మంత్రులు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాల కారణంగా బీఆర్‌‌‌‌ఎస్ ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ నెల 11న కవిత విచారణ సందర్భంగా ఢిల్లీ వెళ్లిన భారత జాగృతి లీడర్లు ఇంకా అక్కడే ఉన్నారు. 

 

పిళ్లైతో కలిపి విచారణ?

ఈ నెల 11న కవితను దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. 16న(గురువారం) మరోసారి తమ ముందు హాజరుకావాలని అప్పుడే సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పిళ్లై కస్టడీ గడువు గురువారంతో  ముగియనుంది. దీంతో మధ్యాహ్నం తర్వాత పిళ్లైని రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో అధికారులు హాజరుపరుచనున్నారు.