హైదరాబాద్: నల్లగొండ జిల్లా కేంద్రంలో జాగృతి ఫ్లెక్సీలు తొలగించడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే ఫ్లెక్సీలు తొలగిస్తారా అని మండిపడ్డారు. ఫ్లెక్సీలు తొలగించడం కాకుండా ప్రభుత్వానికి చేతనైతే ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని హితవు పలికారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం (నవంబర్ 12) నల్లగొండ జిల్లాలో కవిత పర్యటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కూడా నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు అందలేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నల్లగొండ జిల్లాకు సాగునీరు అందించడంలో విఫలం అయ్యాయని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టానని స్పష్టం చేశారు. సుంకిశాల లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై విచారణ జరపాలని కోరారు.
నాగార్జున సాగర్ ఎడమ కాలువను తెలంగాణ ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకోవాలని సూచించారు. కృష్ణా జలాలను నల్లగొండకు తీసుకురాకపోతే భూ నిర్వాసితులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్‌ను తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా నిర్లక్ష్యంగానే పని చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను కలెక్టర్‌లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎపిడ్యూరల్ మెడిసీన్ అందివ్వకపోవడం బాధ అనిపించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎపిడ్యూరల్ మెడిసిన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూదాన్ భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
