
హైదరాబాద్ బేగంపేటలోని మెట్రో పిల్లర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మార్చి 18వ తేదీ శనివారం ఉదయం ఈ పోస్టర్లు కనిపించాయి. రాత్రికి రాత్రి కొందరు వ్యక్తులు.. ఈ పోస్టర్లు అంటించినట్లు కనిపిస్తుంది. అటుగా వెళుతున్న లక్షలాది మంది కంట్లో ఈ పోస్టర్లు పడ్డాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ పోస్టర్లు బహిరంగంగా.. మెట్రో పిల్లర్లపై దర్శనం ఇవ్వటం కలకలం రేపుతోంది.
పోస్టర్లలోని సారాంశాన్ని చూస్తే ఇలా ఉంది.. కవితక్క నీకు కావాలి సారా దందాలో 33 శాతం వాటా.. దాని కోసమే ఆడుతున్నావ్.. 33 శాతం మహిళా రిజర్వేషన్ అంట అంటూ క్యాప్షన్స్ పెట్టారు. మరో పోస్టర్ లో కవిత అంటే పద్యం అనుకుంటిరా.. లే మద్యం అంటూ టైటిల్స్ పెట్టారు. మరో పోస్టర్ లో తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుని.. ఢిల్లీలో కవితక్క చేస్తుంది దొంగ సారా దందా.. కల్వకుంట్ల దొంగల ముఠా.. కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం కేసీఆర్ అంటూ టైటిల్స్ పెట్టి ఈ పోస్టర్లను ముద్రించటం జరిగింది.
బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధి.. పీజీ కాలేజ్ దగ్గరలోని మెట్రో పిల్లర్లకు ఈ పోస్టర్లు అంటించటం జరిగింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. ఆ పోస్టర్లను తొలగించారు. సీసీ కెమెరాలు పరిశీలించి.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.