అన్ని పార్టీల్లో విభేదాలు కామన్..త్వరలో సింగరేణి యాత్ర చేస్తా: ఎమ్మెల్సీ కవిత

అన్ని పార్టీల్లో విభేదాలు కామన్..త్వరలో సింగరేణి యాత్ర చేస్తా: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: అన్ని పార్టీల్లోనూ విభేదాలు కామన్ అని, అలాంటప్పుడు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పైనే దృష్టి పెట్టాల్సిన​అవసరం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ విషయాన్ని పట్టించుకోవద్దని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి ఉదయం ఒక విషయంపై మాట్లాడగానే.. అర గంటలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండిస్తారని, బీజేపీలో సంజయ్​కు ఈటల రాజేందర్ డైరెక్ట్​గా వార్నింగ్ ఇస్తారని.. అయినా హైకమాండ్ స్పందించదని పేర్కొన్నారు.

హైదరాబాద్ బంజారాహిల్స్​లోని తన నివాసంలో హిందూస్థాన్ మజ్దూర్ సంఘ్ (హెచ్ఎంఎస్) ప్రతినిధులతో కవిత ఆదివారం సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఎందుకు రాఖీ కట్టలేదని మీడియా ప్రశ్నించగా.. ఆమె స్పందించ లేదు. ఈ మ్యాటర్​ను వదిలేయాలని అన్నారు. ‘‘నేను ఇప్పటికీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగానే ఉన్న. ప్రభుత్వ వైఖరిపై క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాల్సిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారికి సింగరేణి.. కరప్షన్ గనిగా మారింది.

ఉద్యోగ నియామకాలతో సహా అన్నింట్లో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతున్నది. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ అంచనా వ్యయాలను రాత్రికి రాత్రే పెంచారు. సింగరేణిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఆ సంస్థలో రాజకీయ అవినీతిని అంతం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సింగరేణిలో రాజకీయ అవినీతి పెరిగింది. సింగరేణి సంస్థ కేంద్ర విజిలెన్స్, సీబీఐ పరిధిలోకి వచ్చేలా సంస్థ మారాలి. కార్మికులకు భరోసా ఇవ్వడానికి త్వరలో సింగరేణి యాత్ర చేస్తా’’అని కవిత అన్నారు.

సింగరేణిలో అండర్ గ్రౌండ్ మాన్యువల్ గనులను తెరవాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల పెద్ద వాళ్లే లాభపడుతున్నారని, పైగా కాలుష్యం పెరుగుతున్నదని అన్నారు. ‘‘సగటున ఒక్కో సింగరేణి కార్మికుడు రోజుకు 6 టన్నుల బొగ్గును తవ్వి తీస్తున్నడు. అంటే, రోజుకు ప్రభుత్వానికి దాదాపు రూ.30 వేలు సంపాదించి ఇస్తున్నడు. కానీ, కార్మికులను ప్రభుత్వం ఆదుకోవడం లేదు. పైగా జీతం నుంచి ట్యాక్స్ కట్ చేస్తున్నరు’’అని కవిత మండిపడ్డారు.