
- మాజీ ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ కూచుకుళ్ల ఫైర్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ‘మమ్మల్ని విమర్శిస్తే నీ చరిత్ర బయటపెడతాను’ అని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ.. పదేండ్లు అధికారంలో ఉండి నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్మశానంగా మార్చాడని విమర్శించారు. కాంట్రాక్టర్ల కమీషన్లకు కక్కుర్తి పడి మహిళా శిశుభవన్ ను, ఆర్టీవో ఆఫీస్‌ను ప్రజలకు అందుబాటులో లేకుండా ఊరి బయట కట్టించారన్నారు. 14 నియోజకవర్గాలకు ఎమ్మెల్సీనైన తాను, స్థానిక ఎమ్మెల్యేకు తండ్రిగా సలహాలు ఇస్తానని చెప్పారు.
కానీ, పదేండ్లుగా జక్కా రఘునందన్ రెడ్డి లేకపోతే రాజకీయం చేసే వాడివా? అంటూ నిలదీశారు. ఎన్నికల ముందు ఎలాంటి అనుమతులు లేకుండా రూ.150 కోట్ల పనులు చేపట్టారని, జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో రోడ్లు వేశారని, కాంట్రాక్టర్లకు డబ్బులు రాకపోవడంతో గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. వారికి డబ్బులు చెల్లిస్తూ కొత్త రోడ్లు కడుతున్నామని చెప్పారు. వట్టెం, పోతిరెడ్డిపల్లి గుట్టలను మాయం చేసిన చరిత్ర నీదని ఫైర్ అయ్యారు. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్, ఏఎంసీ చైర్మన్ రమణారావు, సునేంద్ర, నిజాం, శ్రీనివాసులు పాల్గొన్నారు.