22 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలె: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్​

22 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలె: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్​

హైదరాబాద్, వెలుగు:  స్కూల్ ఎడ్యుకేషన్​లో ఉన్న 22వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్​లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌‌‌‌ (యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య​అతిథిగా హాజరైన నర్సిరెడ్డి మాట్లాడుతూ.. టీచర్ల సర్దుబాటు పేరుతో  కేవలం 5,600 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఫైల్​పంపడం సరికాదన్నారు.

సర్కారు స్కూళ్ల బలోపేతానికి ప్రీప్రైమరీ తరగతులను ప్రైమరీ స్కూళ్లకు అనుసంధానించే ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి  మాట్లాడుతూ... టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కోర్టుకేసు పరిధిలో ఉన్నందున వెంటనే స్టే వేకేట్ కు సర్కారు చొరవ చూపాలన్నారు. 2018 పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, వెంటనే రెండో పీఆర్సీ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. అన్ని గురుకులాలను ఒకే డైరెక్టరేట్​ పరిధిలోకి తీసుకురావాలని కోరారు.