వరంగల్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే తాను హనుమకొండ చౌరస్తాలో ఉరేసుకుంటానని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి తెలిపారు. ఆదివారం ఆయన హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ ఆఫీస్‍లో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‍తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేరళం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‍రెడ్డి రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేశాం వచ్చి చూడాలంటూ చెబుతున్నారన్నారు.
పినరై విజయన్‍పై తప్పుగా మాట్లాడుతున్నాడని, రేవంత్‍రెడ్డిది ఆ స్థాయి కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేశారంటూ కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ విమర్శించడాన్ని తప్పుబట్టారు. కేంద్ర మంత్రికి తన శాఖపై కనీస అవగాహన లేదని విమర్శించారు. తెలంగాణ వరి ఉత్పత్తిలో నంబర్ వన్‍లో ఉండడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణం కాదా? అని ప్రశ్నించారు..
మేడారంలో నాసిరకం పనులు జరగడం వల్లే బాలుడు గాయపడినట్లు చెప్పారు. వినయ్‍భాస్కర్ మాట్లాడుతూ.. గజ్వేల్‍లో మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‍పై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. మాజీ జడ్పీ చైర్పర్సన్ సాంబారి సమ్మారావు పాల్గొన్నారు.
