వారంలోనే కులగణన షురూ : తీన్మార్ మల్లన్న

వారంలోనే కులగణన షురూ : తీన్మార్ మల్లన్న
  • బీసీలకు 42% రిజర్వేషన్ల హామీ బాధ్యత తీస్కుంటా: తీన్మార్ మల్లన్న
  • దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి: ఆర్. కృష్ణయ్య 

బషీర్ బాగ్, వెలుగు: కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ బాధ్యత తాను తీసుకుని అమలయ్యేలా చూస్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లక్డీకపూల్ లోని ఓ హోటల్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిల పక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సుకు రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, తీన్మార్​మల్లన్న హాజరయ్యారు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. కుల గణన ప్రక్రియ ఈ వారంలోనే ప్రారంభం కానుందన్నారు. రాష్ట్రంలో ఓసీలు 6 శాతం ఉన్నారని, వీరిలో పేదలు1.5 శాతం మాత్రమే ఉన్నారన్నారు. వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలైతే బీసీ, ఎస్సీ, ఎస్టీలు నష్టపోతారన్నారు. అందుకే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తగ్గించాలన్నారు. మంత్రి పదవుల్లో కూడా బీసీలకు అన్యాయం జరిగిందని, మరో ఆరు మంత్రి పదవులు బీసీలకు దక్కాల్సిందన్నారు.

రాబోయేది బీసీల రాజ్యమని అన్నారు. 2028లో రాష్ట్రంలో బీసీ లీడరే సీఎం అవుతారన్నారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల లెక్కలు శాస్త్రీయంగా ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలన్నారు. లాల్ కృష్ణ అధ్యక్షతన జరిగిన సదస్సులో బీసీ సంక్షేమ సంఘం లీడర్లు ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం, నీల వెంకటేశ్, వేముల రామకృష్ణ, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.