
- ఎమ్మెల్సీ విజయశాంతి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కీలక సమయంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రాకపోవడం ఏమిటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి నిలదీశారు. శనివారం ఆమె కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యే ముందు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తో కలిసి గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ..‘అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడే కేసీఆర్ అనారోగ్యానికి ఎందుకు గురవుతారో అర్థం కావడం లేదు.
అసెంబ్లీకి రాలేనప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్ లోనే ఉండాలి’ అని సూచించారు.భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజాప్రతినిధులుగా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రభుత్వం తరపున కూడా మరింత సాయం కోరతామని విజయశాంతి చెప్పారు. వరదలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మాట్లాడేందుకైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని విజయశాంతి డిమాండ్ చేశారు.