ఇప్పటికే ఆలస్యమైపోయింది.. ఇండియా జీరో టారిఫ్ ప్రతిపాదనపై ట్రంప్

ఇప్పటికే ఆలస్యమైపోయింది.. ఇండియా జీరో టారిఫ్ ప్రతిపాదనపై ట్రంప్

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండియాతో అమెరికా చాలా తక్కువ వ్యాపారం చేస్తుందని, అమెరికాతో ఇండియానే పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తుందని తన సోషల్ మీడియా వేదిక అయిన ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ పోస్ట్ చేశారు. తమకు భారత్‌తో చాలా తక్కువ అవసరం ఉందని చెప్పుకొచ్చారు. అమెరికాతో ఎక్కువ అవసరం భారత్‌కే ఉందని పోస్ట్ చేశారు. ఇండియా చాలా వరకూ ఆయిల్, మిలటరీ ఉత్పత్తులు రష్యా నుంచి కొనుగోలు చేస్తుందని.. తమ నుంచి చాలా తక్కువ అని ట్రంప్ వివరించారు. 

జీరో టారిఫ్ను ఇండియా అమెరికాకు ఆఫర్ చేస్తుందని.. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ పని కొన్నేళ్ల క్రితమే ఇండియా చేసి ఉండాల్సిందని అమెరికా అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. అమెరికాకు ఎగుమతి అయ్యే ఇండియన్ వస్తువులపై సుంకాలు మొత్తం 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపనందుకుగాను ఇండియన్ వస్తువులపై ట్రంప్ ఈ టారిఫ్స్ ప్రకటించారు.

భారత వస్తువులపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించడంతో, ఇండియాలో లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా యూఎస్‌‌‌‌‌‌‌‌కు జరిపే ఎగుమతులపై ఆధారపడే రంగాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇండియాలో వెంటనే  ఉద్యోగ సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కొంత మంది నిపుణులు హెచ్చరిస్తుండగా, మరికొందరు దేశీయ డిమాండ్, ఇతర దేశాలకు ఎగుమతులకు పెంచడం ద్వారా అమెరికా టారిఫ్‌‌‌‌‌‌‌‌ల ప్రభావాన్ని తగ్గించొచ్చని భావిస్తున్నారు.

ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్(జీసీసీ) రంగాలపై కూడా ఈ టారిఫ్‌‌‌‌‌‌‌‌ల ప్రభావం కనిపించనుంది. ఐటీ రంగం ఇప్పటికే మందగమనంలో ఉంది. చాలా కంపెనీలు హైరింగ్ ఆపేశాయి. టారిఫ్‌‌‌‌‌‌‌‌లతో నియామకాలు మరింత తగ్గిపోవచ్చు. జీసీసీలు కూడా నియామకాలు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తాయని అంచనా. టారిఫ్ పరిస్థితి కొనసాగితే, అమెరికాలో భారత మార్కెట్ వాటా తగ్గే ప్రమాదం ఉంది. దీని వల్ల ఎగుమతిదారులు, వాటిపై ఆధారపడే పరిశ్రమలు నష్టపోతాయి.