
హైదరాబాద్: గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో చిరుత పులి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. నిజామాబాద్ జక్రాన్ పల్లి మండలం సికిందలాపూర్ గ్రామ శివార్లలో NH 44, జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం చిరుతను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకొని చిరుత రోడ్డుపైకి ఎలా వచ్చిందని పరిశీలించారు. అనంతరం అటవీ శాఖ అధికారులు చిరుత మృతికి పంచనామా చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని NH 44, జాతీయ రహదారిపై చిరుత ఇలా వాహనాలు ఢీ కొని చనిపోయిన ఘటన గతంలో కూడా జరిగింది. 2023 డిసెంబర్లో దగ్గి అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందింది. దగ్గి -చాంద్రాయణ పల్లి 44వ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం చిరుతను ఢీ కొట్టింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.
తెలంగాణలో చిరుత పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2024 జూన్‌లో నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని నందిపాడ్, జాదరావ్ పల్లి శివార్లలో ఓ చిరుత చనిపోగా, ఆగస్టులో ఒకటి అనుమానస్పదస్థితిలో, మరొకటి ముళ్లపంది దాడిలో చనిపోయింది. 2025 ఫిబ్రవరిలో మోమిన్‌పూర్ శివారులో మరో చిరుత అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. ఏడు నెలల వ్యవధిలోనే నాలుగు చిరుతలు మృత్యువాతపడ్డాయి.
మోమినాపూర్ గ్రామ శివారులోని డంపింగ్ యార్డ్ దగ్గర 2025 ఫిబ్రవరిలో చిరుత పులి కళేబరం గ్రామస్తులకు కనిపించింది. గ్రామస్తులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ నాయక్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి చిరుత కళేబరాన్ని పరిశీలించగా గొంతు, మెడపైన ఏదో జంతువు దాడి చేసినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం చిరుత కళేబరాన్ని నారాయణపేటకు తరలించారు.