
దక్షిణాది సినీ పరిశ్రమలో హారర్-కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన చిత్రం 'కాంచన' . ఇప్పుడు దీనిని ఫ్రాంచైజ్ ఐదవ భాగంతో ప్రేక్షకుల అలరించేందుకు సిద్ధమవుతోంది. నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ నేతృత్వంలో వచ్చిన ఈ సిరీస్‌లోని ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇప్పుడు 'కాంచన 4'పై వస్తున్న ఊహాగానాలు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపాయి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక ఈ ప్రాజెక్ట్‌లో ఒక కీలక పాత్రలో నటించనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
భారీ స్టార్ కాస్ట్
ఈ సారి 'కాంచన 4' చిత్రంలో రష్మిక ఒక దెయ్యం పాత్రలో నటించనుందని తెలుస్తోంది. సౌత్ ఇండియన్ సినిమాల్లో రష్మిక ఇలాంటి సూపర్ నేచురల్ పాత్ర చేయడం ఇదే మొదటిసారి. ఈ చిత్రంలో పూజా హెగ్డే, నోరా ఫతేహి కూడా ముఖ్య పాత్రలు పోషించనున్నారని సమాచారం. ఈ ముగ్గురు అందాల తారలు రాఘవ లారెన్స్‌తో కలిసి తెరను పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 'కాంచన 4' చిత్రానికి రాఘవ లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు.
'కాంచన' ఫ్రాంచైజ్
'ముని' (2007) తో మొదలైన ఈ సిరీస్, 'కాంచన' (2011), 'కాంచన 2' (2015), 'కాంచన 3' (2019) లతో అంచనాలను పెంచుకుంటూ వచ్చింది. ఈసారి, 'కాంచన 4' కూడా మునుపటి భాగాల కంటే మరింత భయం, హాస్యం, ఉత్కంఠను పంచే విధంగా తీర్చిదిద్దబోతున్నారు లారెన్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. అయితే విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. లారెన్స్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'కాంచన 3' కూడా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టింది. ఆ సినిమా తర్వాత నాలుగు సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడం విశేషం.
వరుస సినిమాలతో రష్మిక
'కాంచన 4' తో పాటు రష్మిక చేతిలో మరికొన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవల ఆమె ధనుష్, నాగార్జునలతో కలిసి 'కుబేరా' చిత్రంలో నటించి మొప్పించింది. అలాగే, హిందీ హారర్-కామెడీ చిత్రం 'థమా' లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి కనిపించనుంది. దీంతో పాటు 'ది గర్ల్ ఫ్రెండ్' వంటి ఆసక్తికరమైన సినిమాలు ఆమె విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ సినిమాలన్నీ రష్మిక కెరీర్‌లో కొత్త మైలురాళ్ళుగా నిలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. 'కాంచన 4' గురించి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత, సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం అంటున్నారు అభిమానులు.