
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరసన దీక్ష ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు.
అంతకుముందు వేదిక వద్దకు చేరిన ఎమ్మెల్సీ కవిత పలువురు జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్షలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, రేఖానాయక్‌తోపాటు భారత జాగృతి మహిళా నేతలు కూర్చుకున్నారు. సీపీఎం నేత సీతారాం ఏచూరీ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
పోరాటం ఆగదు : ఎమ్మెల్సీ కవిత
27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రత్యేక హక్కులు ఉండాలని చెప్పారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చే వరకూ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందేందుకు పార్లమెంటులో బీజేపీకి పుల్ మెజార్టీ ఉందన్నారు.