అనాథలకు ఇచ్చిన హామీలు ఏమాయే కేసీఆర్: మందకృష్ణ మాదిగ 

అనాథలకు ఇచ్చిన హామీలు ఏమాయే కేసీఆర్: మందకృష్ణ మాదిగ 

రాజన్న సిరిసిల్ల జిల్లా : అనాథల సంక్షేమంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్  ఇచ్చిన హామీలు ఏమయాయ్యని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. అనాథల గురించి తెలియజేసేందుకు తాను రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చానన్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన వారికి సంక్షేమం కింద ఆశ్రమాలు ఏర్పాటు చేసి, వారికి ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరలేదన్నారు. మొదటి రెసిడెన్షియల్ స్కూల్ ను అనాథల కోసం జిల్లాకు ఒకటి ప్రారంభిస్తామని చెప్పి.. అమలు చేయడం లేదన్నారు. ఆయన తండ్రి అడుగు జాడల్లోనే తనయుడు కేటీఆర్ కూడా వెళ్తున్నారని మండిపడ్డారు. దేశం గర్వించే విధంగా అనాథల కోసం చట్టం తెస్తామని చెప్పిన కేటీఆర్.. ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. అనాథలకు ప్రత్యేక స్మార్ట్ కార్డులు ఇస్తామని కేటీఆర్ చెప్పి ఏళ్లు గడుస్తున్నాయన్నారు. అనాథల అక్రమ రవాణా జరుగుతోందని, కనీసం దీనిపై కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలకు రైతుబంధు ఇస్తే సంతోషిస్తామని, బడా భూస్వాములకు, మంత్రి మల్లారెడ్డి లాంటివాళ్లకు రైతుబందు ఇవ్వొద్దని, వారికి ఇచ్చే డబ్బులను అనాథల సంక్షేమ కోసం ఖర్చు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశంలోనే అనాథల కోసం ప్రత్యేక చట్టం అమలు చేయాలని డిమాండు చేశారు.