పైసలు కావాలి.. పన్నులు కట్టం

పైసలు కావాలి.. పన్నులు కట్టం
  • ఇండియాలో ఎంఎన్​సీ ఇంటర్నెట్ కంపెనీల నిర్వాకం
  • తప్పించుకుంటున్న గూగుల్, ఫేస్ బుక్, అమెజాన్
  • ఇంటర్నెట్ కంపెనీలపై కన్నేసిన ప్రభుత్వం
  • 2019 బడ్జెట్‌లో పలు ప్రకటనలు!

వెలుగు, బిజినెస్‌‌డెస్క్: ఫేస్‌‌బుక్, గూగుల్, అమెజాన్ లాంటి ఇంటర్నెట్ కంపెనీలు ఇండియాలో కోట్ల కొద్ది రూపాయలను ఆర్జిస్తూ… దానికి తగ్గ పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్నాయి. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య మామూలుగా లేదు. దీని క్యాష్ చేసుకుంటూ కోట్ల మంది యూజర్లను మాత్రం సొంతం చేసుకుంటున్నాయి ఇంటర్నెట్ కంపెనీలు . కానీ  పన్నులు కట్టడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఏ దేశంలో పన్నులు తక్కువగా ఉంటే ఆ దేశం నుంచి బిల్లింగ్ చేస్తూ, ఇండియాలో పన్నులకు ఎగనామం పెడుతున్నాయి ఈ కంపెనీలు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇటీవల ఇంటర్నెట్ కంపెనీలపై ఓ కన్నేసింది. తక్కువ పన్ను ఉన్న దేశాల్లో లేదా వారి స్వదేశాల్లో రిజిస్టర్ అయి ఆదాయాలను ఎక్కువగా అక్కడే చూపిస్తున్నాయి… ఇక్కడున్న సబ్సిడరీల రెవెన్యూలను, ప్రాఫిట్‌‌లను తక్కువ చేసి చూపిస్తున్నాయి ఆన్‌‌లైన్ కంపెనీలు. దీంతో పన్నులను కూడా తక్కువగా కట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాయి. లాభాలను ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలించి, ఇంటర్నెట్ కంపెనీలు పన్నుల నుంచి తప్పించుకుంటున్నాయని ఎప్పడి నుంచో పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. ఐతే, దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక సతమతమవుతున్నాయి అనేక దేశాలు. మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రభుత్వం 2019 బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టబోతున్న తరుణంలో తాజాగా ఈ అంశం తెరమీదకు వచ్చింది. ఇలా పన్నుల నుంచి తప్పించుకోవడంపై సరియైన చర్యలే తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చూస్తోంది. ఈ మేరకు బడ్జెట్‌‌లో కొన్ని ప్రకటనలు  వెలువడే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది.

ఈ నెల మొదట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ చేపట్టిన ప్రీ బడ్జెట్ ప్రజెంటేషన్‌‌లో బీజేపీకి, ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌కు ఎంతో సాన్నిహిత్యం ఉన్న నలుగురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. వారు రాష్ట్రీయ స్వాభిమాన్ ఆందోళన్‌‌కు చెందిన కేఎన్ గోవిందాచార్య, భారత్ వికాస్ సంగమ్ సభ్యుడు బసవరాజ్ పటేల్ సేదమ్, హిందూస్తాన్ సమాచార్ గ్రూప్ ఎడిటర్ రామ్ బహదూర్ రాయ్, ఏక్తా పరిషత్ పీవీ రాజగోపాల్. ఈ నలుగురు సామాజిక కార్యకర్తలు కూడా గూగుల్, ఫేస్‌‌బుక్, అమెజాన్ లాంటి అమెరికా ఇంటర్నెట్ కంపెనీలు ఆర్జించే రెవెన్యూలు,వారు కట్టే పన్నులపై ఆ మీటింగ్‌‌లో  తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇండియన్ ఆపరేషన్స్ నుంచి ఆన్‌‌లైన్‌‌ కంపెనీలన్నీ కలిపి రూ.30 లక్షల కోట్లకు పైగా రెవెన్యూలను ఆర్జిస్తున్నాయని, కానీ దానికి తగ్గ పన్నులను కట్టడం లేదని వారు వాదించారు. సబ్సిడరీలను పర్మినెంట్ ఎస్టాబ్లిష్‌‌మెంట్స్‌‌గా పరిగణనలోకి తీసుకోవాలని వారు సూచించారు. ఇండియాలో పన్నులను తప్పించుకోవడానికి ఈ కంపెనీలు కార్పొరేట్ వెబ్‌‌ను క్రియేట్ చేస్తున్నాయని ఆరోపించారు. రెవెన్యూలను మాత్రమే కాకుండా..  ఆ కంపెనీల యూజర్లను కూడా పరిగణనలోకి తీసుకుని పన్నులను లెక్కించాలని వీరు సూచించారు.

పన్ను రూల్స్ మార్చాలని చూస్తోన్న పలు దేశాలు

మల్టినేషనల్ ఇంటర్నెట్ కంపెనీలపై విధించే పన్ను విధానాలపై 2019 బడ్జెట్‌‌లో ప్రభుత్వం పలు ప్రకటనలను చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈక్విలైజేషన్‌‌ లెవీని పెంచుతారని భావిస్తున్నారు. ప్రస్తుతం వీటి ఫారిన్ వెబ్‌‌సైట్లకు ఇండియన్‌‌ కంపెనీలు ఇచ్చే ఆన్‌‌లైన్ ప్రకటనలపై మాత్రమే పన్నులు విధిస్తున్నారు. ఈక్విలైజేషన్ లెవీ ప్రస్తుతం 6 శాతంగా ఉంది. ఈక్విలైజేషన్ లెవీ అంటే ఇండియా నుంచి ఫారిన్ ఈకామర్స్ కంపెనీలు ఆర్జించే ఆదాయాలపై(డిజిటల్ వ్యాపారాలపై) విధించే పన్నులు. బిజినెస్ టూ బిజినెస్ లావాదేవీలపై మాత్రమే ఈ పన్ను ఉంటుంది. నాన్ రెసిడెంట్ ఇంటర్నెట్ కంపెనీలు ఆర్జించే రెవెన్యూలకు పన్ను రూల్స్ మార్చాలని ఇండియాతో పాటు ఓఈసీడీ దేశాలు చూస్తున్నాయి. ఆన్‌‌లైన్ కంపెనీలు పన్నులను నుంచి తప్పించుకోవడానికి  చాలా దేశాల్లో అసలు ఆఫీసులే పెట్టడం లేదు. అయితే డిజిటల్ కంపెనీలు పన్ను విధానాల్లో ఉన్న లూప్ హోల్స్‌‌ను అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్న ఈ పన్నులను  ఎలా రాబడుతుంది..? పన్ను కలెక్షన్స్ పెంచుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇండియాలో రెవెన్యూలు…

ఫేస్‌‌బుక్ ఇంక్ ఇండియా సబ్సిడరీకి 2018లో రూ.521 కోట్ల రెవెన్యూలు వచ్చాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 52% అధికం. అదేవిధంగా గూగుల్ ఇండియా  రూ.9,263 కోట్లను ఆర్జించింది. దీని రెవెన్యూలు కూడా 28.5 శాతం ఎక్కువ. ఇక, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్‌‌కు 2018లో రెవెన్యూలు 54% పెరిగి రూ.5,018 కోట్లకు చేరాయి.

చాలా ఆన్‌‌లైన్ కంపెనీలు ఈకామర్స్‌‌, పేమెంట్ సర్వీసెస్‌‌, అప్లికేషన్ స్టోర్, నెట్‌‌వర్క్ ప్లాట్‌‌ఫామ్‌‌కు సంబంధించినవే. సాధారణంగా ఈ ప్లాట్‌‌ఫామ్స్‌‌పై పేమెంట్లను ఓవర్‌‌‌‌సీస్ నుంచే వసూలు చేస్తాయి. ఇలాంటి లావాదేవీలకు ఇండియాలో ఎలాంటి పన్ను చెల్లించరు. ఇండియాలో క్యాప్టివ్ యూనిట్లు ఉన్నా… పెద్ద మొత్తం వ్యాపారాలు ఇండియా వెలుపల నుంచి వస్తున్నట్టే చూపిస్తాయి. – నిధి గోయల్, ఎండీ, అవినవ్ కన్సల్టింగ్