క్లౌడ్​ టెక్నాలజీలదే భవిష్యత్

క్లౌడ్​ టెక్నాలజీలదే భవిష్యత్

ముంబై : క్లౌడ్ టెక్నాలజీలకు మంచి భవిష్యత్​ ఉందని, చాలా కంపెనీలు ఈ టెక్నాలజీలకు మారుతున్నాయని మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. క్లౌడ్ టెక్నాలజీ ఐటీ రంగానికి కీలకంగా మారిందని కామెంట్​ చేశారు. క్లౌడ్​, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు జీడీపీ గ్రోత్​కు ఎంతో సాయపడతాయని అన్నారు. ‘‘మైక్రోసాఫ్ట్​ తయారు చేసిన పవర్​యాప్స్​సాయంతో స్టేట్​ బ్యాంక్​ తన ఏటీఎంలను వికలాంగులు ఈజీగా వాడుకునేలా చేసింది. మా అజ్యూర్​ ఏఐ టెక్నాలజీ ద్వారా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్​ మంత్రిత్వశాఖ భాషిణి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దీనివల్ల భాషా సమస్యలు దూరమయ్యాయి. ట్రాన్స్​లేషన్​ ఈజీగా మారింది. ప్రాజెక్టు సైట్లలో ఏం జరుగుతున్నదో రియల్​ టైంలో తెలుసుకోవడానికి లార్సన్ అండ్​ టూబ్రో మైక్రోసాఫ్ట్​ అజ్యూర్​ ఐఓటీ, ఏఐలను వాడుతోంది.

కస్టమర్​ టచ్​పాయింట్ల నుంచి డేటాను తీసుకొని సెంట్రలైజ్డ్​ సిస్టమ్​లో రికార్డు చేయడానికి సెంకో గోల్డ్​ అండ్​ డైమండ్స్​ మైక్రోసాఫ్ట్​ డైనమిక్స్​ను ఉపయోగిస్తోంది. ఎయిరిండియా కూడా మా కంపెనీ 365 టూల్స్​, సెక్యూరిటీ సొల్యూషన్స్​ను వాడుతోంది”అని ఆయన వివరించారు.  ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న ఆయన ముంబైలో నిర్వహించిన ఫ్యూచర్​ రెడీ లీడర్షిప్​ సమిట్​లో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. ఈవారంలో ఆయన ఢిల్లీ, బెంగళూరు వెళ్లి కస్టమర్లు, స్టార్టప్​లు, డెవెలపర్స్, ఎడ్యుకేటర్స్​, స్టూడెంట్స్​తో భేటీ అవుతారు. భారత ప్రభుత్వం పబ్లిక్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను భారీగా పెంచుతోందని ప్రశంసించారు. సత్య నాదెళ్ల హైదరాబాద్​లోనే పుట్టిపెరిగారు. ఇదిలా ఉంటే యెస్​బ్యాంక్​ తన కస్టమర్లకు మరింత సమర్థంగా సేవలు అందించేలా యాప్​ తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్​తో ఒప్పందం కుదుర్చుకుంది. క్లౌడ్​ సేవల కోసం హెచ్​డీఎఫ్​సీ కూడా ఈ ఐటీ కంపెనీతో చేతులు కలిపింది.