ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మే 11వ తేదీ ఉదయం 5 గంటల 30 నిమిషాల సమయంలో అదే ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాసేపటికి వాయువ్య దిశగా పయనించి.. ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా పయనించి క్రమంగా బలపడి మే 11న సాయంత్రానికి తుపానుగా మారుతుందని వెల్లడించింది.ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని, తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
మే 12వ తేదీ ఉదయం మళ్లీ క్రమంగా బలపడి, ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత దిశను మార్చుకుని ఉత్తర, ఈశాన్య దిశగా కదిలి క్రమంగా బలహీన పడి 14వ తేదీ మధ్యాహ్నం 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కాక్స్ బజర్ (బంగ్లాదేశ్), క్యుక్య్ఫూ (మయన్మార్) వద్ద తీరం దాటే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోచా తుపానుగా మారబోతోంది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు.. రాష్ర్టంలో పలు ప్రాంతాల్లో దాదాపు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
https://twitter.com/metcentrehyd/status/1656316003859546114
ఇటు ఆంధ్రప్రదేశ్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం...ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానం ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
https://twitter.com/AmaravatiMc/status/1656232164713988097