- మోడల్ కారిడర్ల పేరుతో రూ.568 కోట్లు వృథా
- అసంపూర్తిగానే గతేడాది చేపట్టిన పనులు
- ఫెసిలిటీస్ కల్పించని బల్దియా అధికారులు
- కొత్త సర్కార్ దృష్టి పెట్టాలని కోరుతున్న సిటీ జనం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో మోడల్ కారిడార్ల పేరిటి పనులు చేపట్టారు. వాటిని మధ్యలోనే నిలిపేయగా అసంపూర్తిగానే మిగిలాయి. దీంతో రూ. 568.2 కోట్లు వృథా అయ్యాయి. మోడల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా 150 నుంచి 200 అడుగుల వెడల్పుతో రోడ్లపై 21,535 మీటర్ల మేర సైకిల్ ట్రాక్లు, పార్కింగ్ స్థలాలు,సర్వీస్ రోడ్లు, ఫుట్పాత్లు, గ్రీనరీతో కూడిన సెంట్రల్ మీడియన్లు, వెండింగ్ జోన్లు, రెండు క్యారేజ్వేలు వంటి సౌకర్యాలు కల్పించేందుకు గతేడాది పనులు చేపట్టారు.
కొన్నిచోట్ల పనులు పూర్తయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా వదిలేశారు. వసతులు కల్పించేందుకు వినూత్నంగా 29 మోడల్ కారిడార్ రోడ్లను చేపట్టనున్నట్లు బల్దియా చెప్పింది. కానీ.. పనుల పేరుతో ప్రజాధనాన్ని అధికారులు వృథా చేశారే తప్ప ప్రజలకు మేలు చేయలేదు. డెవలప్మెంట్ పనులు చేసిన చోట కూడా ప్రజలకు ఉపయోగపడటం లేదు. 29 కారిడార్లు చేపట్టగా ఇందులో అత్యధికంగా ఖైరతాబాద్ జోన్లో 19 , శేరిలింగంపల్లి జోన్లో 3, ఎల్ బీనగర్లో జోన్ 4, చార్మినార్ జోన్లో 3 ఉన్నాయి.
గతేడాదిలోనే టెండర్లు పూర్తి కావడంతో పాటు పనులు షురూ చేయగా.. ఇందులో సగానికి పైగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. కానీ ప్రజలకు సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. బల్దియా ఖజానా మాత్రం ఖాళీ అయింది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన జీహెచ్ఎంసీపై ఎలాంటి వృథా ఖర్చులు కాకుండా మరింత భారం పడింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మోడల్ కారిడార్ పనులపై దృష్టి పెట్టి సౌకర్యాలు కల్పించేలా చూడాలని జనం కోరుతున్నారు.
ఖైరతాబాద్ జోన్లో 19 పనులు
ఖైరతాబాద్ జోన్లో 19 పనులు చేపట్టగా ఇందులో సగానిపైగా పనులు పూర్తిచేసినట్లు చెబుతున్నప్పటికీ చాలా వరకు అసంపూర్తిగానే ఉన్నాయి. సరోజినీ దేవి కంటి ఆస్పత్రి నుంచి రేతిబౌలి జంక్షన్ వరకు రూ.1.90 కోట్లతో 1400 మీటర్ల పొడవున ఎడమ వైపు రోడ్డు, రూ.1.75 కోట్లతో కుడి వైపు 1400 మీటర్ల పొడవున అభివృద్ధికి పనులు చేపట్టారు.
రేతిబౌలి జంక్షన్ నుంచి నానల్ నగర్ జంక్షన్ వరకు రూ. 93 లక్షలలో 390 మీటర్ల పొడవు మోరిన్ బేకరీ నుంచి మిషా మెడికల్ వరకు రూ. 1.7 కోట్లతో 480 మీటర్లు పొడవు, మిషా మెడికల్స్ నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు రూ. 87 లక్షలతో 440 మీటర్ల పొడవు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మేఘన హోసిరీ వరకు రూ. 73 లక్షలతో 320 మీటర్ల పొడవు, మేఘన హోసిరీ నుంచి బంధన్ ఫంక్షన్ హాల్ వరకు రూ.91 లక్షలతో 480 మీటర్ల పొడవు, బంధన్ ఫంక్షన్ హాల్ నుంచి హీరో ఎస్ఎల్ఎన్ ఆటోమొబైల్ వరకు రూ. 90 లక్షలతో460 మీటర్ల మేర, ఎస్ఎల్ఎన్ ఆటో మొబైల్ నుంచి ఎస్ఎం జూనియర్ కాలేజ్ వరకు రూ. 68 లక్షలతో 340 మీటర్ల పొడవున, శివాలయం నుంచి ఎస్ఎం జూనియర్ కాలేజీ వరకు రూ.71 లక్షలతో 180 మీటర్ల పొడవు, టోలిచౌకి ఫ్లైఓవర్ నుంచి సూర్యనగర్ జంక్షన్ వరకు ఇరువైపులా పాత ముంబై హైవే, షేక్పేట్ వరకు రూ.2 కోట్లతో 450 మీటర్ల పొడవున బీటీ రోడ్డు, ఫుట్పాత్ వే, సూర్య నగర్ జంక్షన్ నుంచి సబ్జా కాలనీ జంక్షన్ వరకు రూ. 2 కోట్లతో 450 మీటర్ల పొడవు బీటీ రోడ్డు, ఫుట్పాత్ నిర్మాణాల కోసం ఖర్చు చేశారు. అయినప్పటికీ ఇందులో చాలా చోట్ల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.
మిగతా మూడుజోన్లలో ఈ పనులు..
ఎల్ బీనగర్ జోన్ ఉప్పల్ సర్కిల్లోని హబ్సిగూడ క్రాస్ రోడ్డు నుంచి మూసీ వంతెన నాగోల్ వరకు ఇరువైపులా రూ. 2.91 కోట్లతో 3680 మీటర్ల పొడవున ఫుట్పాత్, సైకిల్ ట్రాక్ అభివృద్ధి, నాగోల్ వంతెన (మూసీ నది) నుంచి ఎల్ బీనగర్ రోడ్ల వైపు హయత్ నగర్ సర్కిల్, ఎల్బీనగర్ జోన్ లో రూ. 3.84 కోట్లతో 3500 మీటర్ల పొడవు ఫుట్పాత్, సైకిల్ ట్రాక్ అభివృద్ధి, చార్మినార్ జోన్లోని చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ నుంచి మొఘల్ కాలనీ, చాంద్రాయణగుట్ట నుంచి బల్దియా ఆఫీసు వరకు రూ. 6 కోట్లతో 1400 మీటర్ల పొడవు మోడల్ కారిడార్ అభివృద్ధి, రాజేంద్రనగర్ సర్కిల్- లోని మొగల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి దుర్గానగర్ జంక్షన్ వరకు రూ. 6 కోట్లతో 1225 మీటర్ల పొడవు మోడల్ కారిడార్ అభివృద్ధి, రాజేంద్రనగర్ సర్కిల్ లోని దుర్గానగర్ జంక్షన్ నుంచి ఆరాంఘర్ వరకు రూ. 5.78 కోట్లతో 980 మీటర్ల పొడవు మోడల్ కారిడార్ కింద రహదారి అభివృద్ధి, శేరిలింగంపల్లి జోన్ లని కొండాపూర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి లెదర్ ఇన్స్టిట్యూట్ (ఎడమవైపు) వరకు రూ. 6 కోట్లతో 1400 మీటర్ల పొడవు మోడల్ కారిడర్ అభివృద్ధి, ఐటీ హైట్స్ నుంచి గచ్చిబౌలి, ఖాజాగూడ జంక్షన్ వరకు రూ. 5.20 కోట్లతో 1310 మీటర్ల పొడవు మోడల్ కారిడర్ అభివృద్ధి, నానక్ రాం గూడ జంక్షన్ నుంచి గచ్చిబౌలి ఐటీహైట్స్ రోడ్డు వరకు రూ. 5.50 కోట్లతో 1310 మీటర్ల పొడవు మోడల్ కారిడర్ అభివృద్ధి చేశారు. వీటిలో కూడా పనులు చాలా వరకు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.