మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బందికిజీతాలు పెంచాలి: సీఐటీయూ

మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బందికిజీతాలు పెంచాలి: సీఐటీయూ

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు సీఐటీయూ ధర్నా 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ హాస్టళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వెంటనే జీతాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మంగళవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు తెలంగాణ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ సిబ్బంది ధర్నా నిర్వహించారు.

 ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బంది పదేండ్లుగా అతి తక్కువ వేతనాలతో  పనిచేస్తున్నారని చెప్పారు. వారికి జీతాలు పెంచి.. ఈఎస్ఐ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెటర్నిటీ లీవులు, డ్యూటీ చార్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ హాస్టల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ... మోడల్ స్కూల్ హాస్టళ్లలో పనిచేసే వారిలో నిరుపేదలు, ఒంటరి మహిళలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ధర్నా అనంతరం డైరెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కిరణ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.