
- కొలువులో చేరినప్పటి నుంచి ఒకే దగ్గర ఉద్యోగం
- హైకోర్టు ఆదేశాలతో 2,757 మందికి స్థానచలనం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లకు ఎట్టకేలకు బదిలీలు జరిగాయి. నాలుగేండ్లు కాదు.. ఏకంగా 11 ఏండ్ల తర్వాత ట్రాన్స్ ఫర్స్నిర్వహించారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒకే దగ్గర పనిచేస్తున్న సుమారు 2,757 మందికి స్థానచలనం కల్పించారు. ఈ మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచే టీచర్లకు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్‌చారి బదిలీల ఉత్తర్వులు ఇచ్చారు. సాయంత్రంలోగా కొత్తగా బదిలీ అయిన స్కూళ్లలో చేరాలని వారికి సూచించారు. బదిలీ అయిన వారిలో ప్రిన్సిపాళ్లు 89 మంది ఉండగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 1,923 మంది, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 745 మంది ఉన్నారు. సీనియార్టీ ప్రకారం బదిలీలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన రెండు రోజుల్లోనే విద్యాశాఖ వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం విశేషం.
ఉమ్మడి రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ ఏర్పాటు
ఉమ్మడి రాష్ట్రంలో 2013–14 విద్యాసంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో 357 మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 194 స్కూళ్లు ఉన్నాయి. అప్పట్లో కేంద్రం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులు ఖర్చు చేసేవి. అయితే, ఆ తర్వాతి రెండేండ్లకే 2015–16 విద్యా సంవత్సరం నుంచే ఈ స్కూళ్ల బాధ్యత నుంచి కేంద్రం వైదొలిగింది. దీంతో అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ఆ స్కూళ్ల నిర్వహణ చూస్తున్నది. ఈ క్రమంలో మోడల్ స్కూల్ ఉద్యోగులకు 2019 లో సర్వీస్ రూల్స్ తీసుకొచ్చింది. అయితే, తమకు బదిలీలు నిర్వహించాలని మోడల్ స్కూల్ టీచర్లు పలుమార్లు ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు 2023 జులైలో మోడల్ టీచర్ల బదిలీలకు గత బీఆర్ఎస్సర్కారు షెడ్యూల్ రిలీజ్ చేసింది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ఇదే సమయంలో ఒకే నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయినా.. 2013, 2014లో ఉద్యోగాల్లో చేరిన వారికి సీనియార్టీ, సర్వీస్ పాయింట్ల విషయమై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బదిలీల ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా, సీనియార్టీ ఆధారంగానే బదిలీల పాయింట్లు కల్పించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ప్రక్రియంతా రెడీగా ఉండడంతో, శనివారం తెల్లవారుజాము నుంచే టీచర్లకు బదిలీల ఆర్డర్లు పంపించింది. దీంతో టీచర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
సీఎంకు టీచర్ల సంఘాల కృతజ్ఞతలు
బదిలీలు విజయవంతంగా పూర్తిచేయడం పట్ల టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, పీఎంటీఏ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్, ఎంఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేసినందుకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యాశాఖ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, టీచర్ ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమోషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.