మోదీ 28 పైసా పీఎం : ఉదయనిధి స్టాలిన్

మోదీ 28 పైసా పీఎం : ఉదయనిధి స్టాలిన్
  • రాష్ట్రం చెల్లించిన పన్నుల్లో ప్రతి రూపాయిలో 
  • 28 పైసలే తిరిగిస్తోంది 

చెన్నై/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 28 పైసా పీఎం అని తమిళనాడు మంత్రి, డీఎంకే లీడర్  ఉదయనిధి స్టాలిన్  అన్నారు. కేంద్రానికి తమిళనాడు పన్నుగా చెల్లించిన ప్రతి రూపాయిలో కేంద్రం 28 పైసలే తిరిగి ఇస్తున్నదని మండిపడ్డారు. రామాంతపురం, తేనిలో ఆదివారం నిర్వహించిన ర్యాలీల్లో ఉదయనిధి మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం అధిక నిధులు ఇస్తోందని, బీజేపీయేతర రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని అన్నారు. ‘కేంద్రానికి రాష్ట్రం పన్నుగా చెల్లించిన ప్రతి రూపాయిలో మనకు 28 పైసలే కేంద్రం తిరిగి ఇస్తోంది. కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం ఎక్కువ నిధులు ఇస్తోంది. ఇక నుంచి మోదీని మనం 28 పైసా పీఎం అని పిలవాలి’ అని ఉదయనిధి వ్యాఖ్యానించారు.

ప్రధానిని తిట్టిన డీఎంకే మంత్రి.. బీజేపీ ఫైర్ 

ప్రధాని నరేంద్ర మోదీని బూతులు తిట్టిన తమిళనాడు మంత్రి అనితా రాధాకృష్ణన్ పై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ హెడ్డాఫీసులో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. అనితా రాధాకృష్ణన్ వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. వెంటనే రాధాకృష్ణన్  క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్​ చేశారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ.. ప్రతిపక్షాల కూటమి అంతరాత్మ చనిపోయిందని అన్నామలై అన్నారు. ‘‘డీఎంకే లీడర్లు నైతికంగా దిగజారిపోయారు. అనితా రాధాకృష్ణన్ మాటలు డీఎంకే బూతు సంస్కృతికి అద్దం పడుతున్నాయి” అని అన్నామలై వ్యాఖ్యానించారు.