- అధికార పక్షానిది రోజుకో డ్రామా: ఎంపీ మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ డ్రామా సెంటర్‌లాగా మారిపోయిందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి అన్నారు. ఇండియా కూటమి ఎంపీలమంతా ఎస్ఐఆర్(సర్)పై చర్చ జరపాలని కోరుతుంటే.. ఎన్డీయే సర్కారు భయపడుతోందని అన్నారు. మంగళవారం లోక్‌సభ వాయిదా పడిన తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
మోదీ నేతృత్వంలో అధికార పక్షం పార్లమెంట్ వేదికగా రోజుకో డ్రామాకు తెరలేపుతోందన్నారు. ఆధికారపక్షమే డ్రామాలాడుతూ నిందలు మాత్రం కాంగ్రెస్‌పై వేస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు చర్చల కోసం డిమాండ్ చేస్తే.. ప్రధాని డ్రామాలు అంటున్నారని, ప్రజల తరఫున ప్రశ్నలు అడగటం డ్రామానా.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం?.. అని మల్లు రవి ప్రశ్నించారు.
మెజార్టీ ఉందికదా అని ఏకపక్షంగా బిల్లులను ఆమోదించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని అన్నారు. రెండ్రోజుల్లో రెండు గంటలు కూడా పార్లమెంట్ సాగలేదని.. సభ నడవడం, ప్రజల గురించి మాట్లాడడం మోదీకి ఇష్టముండదని ఆయన ఆరోపించారు.
