ఆర్థిక శాస్త్రంలో అభిజిత్ బెనర్జీకి నోబెల్.. మోడీ అభినందనలు

ఆర్థిక శాస్త్రంలో అభిజిత్ బెనర్జీకి నోబెల్.. మోడీ అభినందనలు

పేదరిక నిర్మూలనపై అధ్యయనానికి ముగ్గురికి నోబెల్

కాంగ్రెస్ పథకం ‘న్యాయ్’ రూపకల్పనలో అభిజిత్ పాత్ర: రాహుల్

న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనకు చేసిన కృషి, అవలంభించాల్సిన ఆర్థిక విధానాలపై అధ్యయనానికి అర్థ శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు ముగ్గురు ఆర్థికవేత్తలు.

ప్రవాస భారత ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో (ఫ్రెంచ్ అమెరికన్), అమెరికన్ ఆర్థికవేత్త మైకెల్ క్రెమెర్ కలిసి ఉమ్మడిగా చేసిన పరిశోధనలకు నోబెల్ దక్కింది. అభిజిత్ బెనర్జీ.. పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు.

మోడీ అభినందనలు

పేదరిక నిర్మూలనకు అభిజిత్ బెనర్జీ ఎనలేని కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2019కి గాను నోబెల్ ప్రైజ్ కు ఎంపికైనందుకు అభిజిత్ తోపాటు ఎస్తర్, మైకెల్ క్రెమర్ లను ఆయన అభినందించారు.

న్యాయ్ పథకం రూపకల్పనలో అభిజిత్ పాత్ర

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ సాధించిన అభిజిత్ బెనర్జీని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందించారు. పేదరిక నిర్మూలనకు ఆయన చేసిన కృషిని మెచ్చుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన హామీ అయిన ‘న్యాయ్’  పథకం రూపకల్పనలో అభిజిత్ కీలక పాత్ర పోషించారని రాహుల్ చెప్పారు. ఈ స్కీమ్ ద్వారా పేదరికాన్ని నిర్మూలించి.. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని భావించామన్నారు. కానీ దీనికి విరుద్ధంగా ప్రస్తుత మోడీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తూ.. పేదరికాన్ని పెంచుతున్నారని అన్నారు రాహుల్.

న్యాయ్ పథకం కింద దేశంలోని పేదలందరికీ నెలకు రూ.6 వేల చొప్పున ఇస్తామని 2019 ఎన్నికల్లో రాహుల్ ప్రకటించారు.

           మైకెల్ క్రెమెర్                                                              ఎస్తర్ డఫ్లో                                                         అభిజిత్ బెనర్జీ