మోదీతోనే దేశానికి ప్రపంచ గుర్తింపు  :  బీజేపీ శాసనసభా పక్ష ఉప నేత వెంకటరమణారెడ్డి

మోదీతోనే దేశానికి ప్రపంచ గుర్తింపు  :  బీజేపీ శాసనసభా పక్ష ఉప నేత వెంకటరమణారెడ్డి

ములుగు, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, అయితే పార్లమెంట్‌‌‌‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చినప్పుడు కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు అడ్డుకున్నాయని బీజేపీ తెలంగాణ శాసనసభా పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. సోమవారం ములుగులోని పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏండ్లుగా దేశాన్ని పాలించామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇతరులకు అవకాశాలు రాకుండా చట్టాలు చేసిందని విమర్శించారు. 8 మంది బీజేపీ ఎంపీలతో తెలంగాణ రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.

ములుగు జిల్లాకు గిరిజన యూనివర్సిటీ, రామప్ప ఆలయానికి ప్రసాద్ పథకం ద్వారా రూ.70 కోట్లు కేంద్రం కేటాయించిందని గుర్తుచేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం ప్రజాదరణకు నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌‌‌‌లో జరిగే మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూక్య జవహరల్ లాల్, అజ్మీర కృష్ణవేణినాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రవీంద్రాచారి, నగరపు రమేశ్ పాల్గొన్నారు.