
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోదీ చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని, నియంతృత్వం సాగుతోందన్నారు. దేశంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి హామీ ఇచ్చే ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఆత్మ లాంటిదని, కానీ నేడు అదే రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్నారు.
రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే, నిజంగా రాజ్యాంగాన్ని మార్చేవారని చెప్పారు. ఈ కుట్రను అడ్డుకునేందుకే 2024 ఎన్నికల ప్రచారంలో ‘రాజ్యాంగ రక్షణ’నే ప్రధాన అంశంగా కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నదని, కుట్రను అడ్డుకోవడంలో సక్సెస్ కూడా అయిందన్నారు. ‘‘రాజ్యాంగం నుంచి లౌకిక, సోషలిస్ట్ అనే పదాలను తొలగించాలని కొందరు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు పదే పదే చెబుతున్నారు. అధికారం శాశ్వతం కాదని వారు గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ పరిరక్షణలో ప్రజల శక్తి అపరిమితం. ఆ ప్రజలే బీజేపీకి 400 సీట్లు కాదు.. కనీసం సాధారణ మెజారిటీ కూడా ఇవ్వకుండా ముఖంపై కొట్టారు” అని ఖర్గే అన్నారు.
ఒక వర్గంపై హైకోర్టు జడ్జి అవమానకర వ్యాఖ్యలు చేసినా, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దళితులు, ఆదివాసీలు, పేదలు, మైనారిటీలకు ఓటు హక్కు లేకుండా చేయాలన్న దురుద్దేశంతోనే బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్(సర్) జాబితా తెచ్చారని ఖర్గే ఆరోపించారు. ‘సర్’ పేరుతో దాదాపు 65 లక్షల మందిని బిహార్ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారని ఫైర్ అయ్యారు.