ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నది: మోదీ

ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నది: మోదీ
  • వారసత్వ ఆస్తులకూ ట్యాక్స్ వేస్తరు
  • జనం బతికినా, మరణించినా  దోచుకోవడమే ఆ పార్టీ పని
  • ఆస్తులతో పాటు రిజర్వేషన్లు కొల్లగొట్టేందుకూ ప్లాన్
  • మతపరమైన రిజర్వేషన్లతో అంబేద్కర్ కు వెన్నుపోటు పొడిచారు 
  • చత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీల్లో మోదీ ఫైర్

సర్గుజా/సాగర్ : కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఆలోచనలు ఉన్నాయని, అవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికారంలోకి వస్తే పేరెంట్స్ నుంచి పిల్లలకు వారసత్వంగా వచ్చే ఆస్తులపైనా పన్ను వేయాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రజల ఆస్తులతో పాటు హక్కులనూ దోచుకోవాలని చూస్తున్నదని విమర్శించారు. వారసత్వ పన్నుపై కాంగ్రెస్ లీడర్ శ్యామ్ పిట్రోడా చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చత్తీస్ గఢ్ లోని సర్గుజా, మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాల్లో జరిగిన ర్యాలీల్లో మోదీ మాట్లాడారు. ‘‘మధ్య తరగతి ప్రజలపై పన్నులు మరింత విధించాలని కాంగ్రెస్ యువరాజు సలహాదారు ఒకరు ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు వాళ్లు మరింత ముందుకు వెళ్లారు. తాజాగా వారసత్వ పన్ను విధిస్తామని కాంగ్రెస్ చెబుతున్నది. 

వారసత్వంగా వచ్చే ఆస్తులపైనా పన్ను వేస్తుందట. అంటే మీరు కష్టపడి సంపాదించే సంపద మీ పిల్లలకు చెందదు.. దాన్ని కాంగ్రెస్ దోచుకుంటుంది. మీరు బతికి ఉన్నంతకాలం దోచుకోవడంతో పాటు మీరు చనిపోయిన తర్వాత కూడా దోచుకోవాలని చూస్తున్నది. ఇదే కాంగ్రెస్ పార్టీ సూత్రంలా ఉన్నది” అని విమర్శించారు. ‘‘మన దేశంలో పిల్లల బాగు కోసం తల్లిదండ్రులు ఆస్తులు కూడబెడతారు. వాళ్ల భవిష్యత్తు బాగుండాలని కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత పోగు చేస్తారు. కానీ ఇది కాంగ్రెస్ కు నచ్చడం లేదు. మన విలువలు, సంస్కృతీ సంప్రదాయాలపైనే దాడి చేస్తున్నది” అని మోదీ మండిపడ్డారు. 

రిజర్వేషన్ల దోపిడీకీ ప్లాన్.. 

దేశ ప్రజల ఆస్తులనే కాకుండా రిజర్వేషన్లను కూడా దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నదని మోదీ ఆరోపించారు. ‘‘మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను లాక్కోవాలని చూస్తున్నది. రాజ్యాంగానికే తూట్లు పొడవాలని చూస్తున్నది” అని మండిపడ్డారు. 

ఓబీసీలకు అతిపెద్ద శత్రువు కాంగ్రెస్. ఆ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించింది. మొదట 2004లో ఈ తరహా రిజర్వేషన్లు కల్పించి అంబేద్కర్ కు వెన్నుపోటు పొడిచింది. ఆ తర్వాత కర్నాటకలోనూ అట్లనే చేసింది. ముస్లింలను ఓబీసీ కోటాలో చేర్చి, ఓబీసీలకు అన్యాయం చేసింది” అని అన్నారు. కర్నాటకలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లను రద్దు చేశామని మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు దేశమంతటా కర్నాటక మోడల్ ను అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదని మండిపడ్డారు.

సర్వే చేసి ఆస్తులు గుంజుకుంటది.. 

ప్రజలు కూడబెట్టుకున్న ఆస్తులపై కాంగ్రెస్ కన్నేసిందని మోదీ ఆరోపించారు. ‘‘దేశంలో ప్రజల ఆస్తులపై సమగ్ర సర్వే నిర్వహిస్తామని కాంగ్రెస్ చెబుతున్నది. సంపదను అందరికీ పంచిపెడతామని అంటున్నది. అంటే మీ ఇండ్లు, పొలాలు, షాపులు.. ఇలా దేన్నీ వదిలిపెట్టదు. మీరు దాచుకున్న నగలతో పాటు మెడలో వేసుకున్న మంగళసూత్రాలు సైతం లెక్కిస్తుంది. 

ఆ తర్వాత అవన్నీ దోచుకుంటుంది” అని అన్నారు. ‘‘వికసిత్ భారత్ మా లక్ష్యమని మేం ప్రకటించగానే.. కాంగ్రెస్, ఆ పార్టీ పంచన చేరిన శక్తులకు కోపం వస్తున్నది. ఒకవేళ ఇండియా పవర్ ఫుల్ గా మారితే తమ దుకాణాలు బంద్ అవుతాయని కొన్ని శక్తులు ఆందోళన చెందుతున్నాయి. అందుకే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచే బలహీన ప్రభుత్వం ఏర్పడాలని ఆ శక్తులు కోరుకుంటున్నాయి.అందుకోసమే ప్రయత్నాలు చేస్తున్నాయి” అని మోదీ ఫైర్ అయ్యారు.