మోదీ సర్కారు రైతులను లాభాలకు దూరం చేసింది

మోదీ సర్కారు రైతులను లాభాలకు దూరం చేసింది
  •  పదేండ్లు వారిని అప్పులపాలు చేసింది: జైరాం రమేశ్

న్యూఢిల్లీ: గత పదేండ్లలో దేశంలోని రైతులు ఎలాంటి లాభాలు ఆర్జించకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుందని కాంగ్రెస్​పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ఆరోపించారు. ధరలు పెరిగినప్పుడు రైతులు బాగా సంపాదించుకోవడానికి అనుమతించకుండా, ధరలు పడిపోయినప్పుడు వారిని ఆదుకోకుండా వదిలేసిందని ఆయన మండిపడ్డారు. దేశ ప్రజల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని తాను చివరిసారి ప్రశ్నలు అడుగుతున్నానని జైరాం రమేశ్ ట్విటర్​లో పోస్ట్​ చేశారు.

‘‘ఈ ఔట్​గోయింగ్​పీఎం.. భారతదేశ రైతులకు కాకుండా రష్యా రైతులకు ఎంఎస్​పీ హామీ ఇస్తారా? దళితులు, ఆదివాసీలు,  ఓబీసీలకు రిజర్వేషన్లపై 50% పరిమితిని పెంచుతారా? అడంపూర్ విమానాశ్రయం ఒకే విమాన మార్గాన్ని ఎందుకు కలిగి ఉంది? చండీగఢ్‌లోని పోస్ట్​ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్​లో తీవ్రమైన సిబ్బంది కొరతను పరిష్కరించడంలో మోదీ సర్కార్ ఎందుకు విఫలమైంది?”అని ఆయన ప్రశ్నించారు.

అలాగే, ఎన్నికల తర్వాత రష్యా నుంచి గోధుమలను దిగుమతి చేసుకోవాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయని.. దీంతో దేశంలో గోధుమ ధరలను తగ్గించి, మన రైతులను దెబ్బతీస్తుందని ఆయన విమర్శించారు. ఈ విధానాన్ని మోదీ సర్కారు ఎప్పటి నుంచో అవలంబిస్తున్నదన్నారు.