ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి  కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • క్వార్టర్ల కేటాయింపులో ఇబ్బంది తొలగించండి
  • ఆర్జీ 1 ఏరియా జీఎంకు సింగరేణి ఆఫీసర్ల వినతి

గోదావరిఖని, వెలుగు : కొంతకాలంగా క్వార్టర్ల కేటాయింపులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, గేటెడ్‌‌‌‌ కమ్యూనిటీ కాలనీలలో, బంగ్లాస్‌‌‌‌ ఏరియాలో ఆఫీసర్లకు తగిన క్వార్టర్లు ఇవ్వకుండా బయటి వ్యక్తులకు కేటాయిస్తున్నారని సింగరేణి ఆఫీసర్ల ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోల్‌‌‌‌మైన్స్‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో శనివారం ఆర్జీ 1 ఏరియా జీఎం నారాయణకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ పొనుగోటి శ్రీనివాస్‌‌‌‌ మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు శ్రమిస్తున్న ఆఫీసర్లు అనేక మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారన్నారు. ట్రాన్స్‌‌‌‌ఫర్ల సమయంలో గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌లు, టెంపరరీ నివాసాలలో ఆఫీసర్లు ఉంటున్నారని, ఈ విధానానికి స్వస్థిపలికి క్వార్టర్ల కేటాయింపునకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌‌‌‌ఓటు జీఎం రాంమోహన్‌‌‌‌, పర్సనల్‌‌‌‌ డీజీఎం లక్ష్మీనారాయణ, రామకృష్ణ, నవీన్‌‌‌‌ పాల్గొన్నారు. 


చివరి ఆయకట్టు గ్రామాలకు సాగునీరు
ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు 

మల్లాపూర్ ,వెలుగు : చివరి ఆయకట్టు గ్రామాలన్నింటికీ సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మండలంలోని కొత్త ధాంరాజ్ పల్లి , సాతరంలో శనివారం కొత్తగా మంజూరైన పింఛన్, కల్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి ఆయకట్టు గ్రామాలైన ఓబులాపూర్, సంగెం శ్రీరాంపూర్, కొత్త , పాత్త దామరాజుపల్లి, వాల్గొండ తండా, వాల్గొండ , గొర్రెపల్లి, వేంపల్లి వెంకట్రావుపేట, రేగుంట గ్రామాలకు సాగునీరు అందించేవిధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సరోజన, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ నాగేశ్, ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ శరత్ తదితరులు పాల్గొన్నారు. 

మిల్లెట్​ ఫుడ్ లో పోషకాలు
జడ్పీ చైర్ పర్సన్ అరుణ

కోనరావుపేట, వెలుగు : చిన్నారుల్లో పోషణ లోపాన్ని నివారించడానికి చిరుధాన్యాలతో ఆహారాన్ని అందిస్తున్నామని జిల్లా పరిషత్ చైర్​పర్సన్ ఎన్.అరుణ తెలిపారు. శనివారం కోనరావుపేటలో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహార లోపాలున్న బాల,బాలికలను గుర్తించి వారి ఎదుగుదల కోసం ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోందన్నారు. జిల్లాలో ఆరేళ్లలోపు చిన్నారులు సరైన ఎత్తు, బరువు ఉండేలా పరీక్షించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో అంగన్​వాడీ పిల్లలకు, పోషణ లోపంతో బాధపడుతున్న వారికి రాగి జావ, లడ్డు, పాయసం లాంటి చిరుధాన్యాలతో తయారైన ఫుడ్​ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సీడీపీఓ ఎల్లయ్య, రేఖ, ఎంపీటీసీ చారి  పాల్గొన్నారు. 

బీసీ స్టూడెంట్లకు అత్యుత్తమ విద్య
స్పోర్ట్స్ మీట్ ముగింపు సభలో మంత్రి గంగుల 

కరీంనగర్‍టౌన్, వెలుగు: ఉన్నతవర్గాల విద్యార్థులకు దీటుగా బీసీ బిడ్డలకు విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ బీసీ గురుకులాల డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో బీసీలు ఎంతో వెనకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో  9 గురు కులాల్లో కేవలం 16 వేల మందికి విద్యనందిస్తే,  ప్రస్తుతం 281 గురుకులాల్లో 1,51,000 మందికి విద్యనందిస్తున్నామని వివరించారు. గతంలో  చదవాలన్న తపన ఉన్నా అంధ్రా పాలకులు విద్యను అందించలేదని ఆరోపించారు. విద్యతో పాటు ఇష్టమైన క్రీడల్లో రాణించాలని చెప్పారు. త్వరలో అన్ని గురుకులాలకు వాటర్ హీటర్ల ద్వారా వేడినీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. 

చిందేసిన గంగుల..

క్రీడా పోటీల విజేతలకు బహుమతుల పంపిణీలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు డాన్స్​చేశారు. స్టూడెంట్ల కోరిక మేరకు మంత్రి గంగుల కూడా స్టెప్పులు వేశారు. దీంతో స్టేడియం  అంతా చప్పట్లతో దద్దరిల్లింది. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఆర్ సీఓ గౌతమ్ రెడ్డి, ప్రిన్సిపల్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.  

ముంచెత్తిన వాన

కరీంనగర్ ​టౌన్, కోనరావుపేట, జమ్మికుంట, కొత్తపల్లి, వెలుగు : కరీంనగర్​జిల్లా కేంద్రంతోపాటు కోనరావుపేట, జమ్మికుంట మండలాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. క‌‌రీంన‌‌గ‌‌ర్ లో డ్రైనేజీలు పొంగడంతో తిరుమ‌‌ల్ న‌‌గ‌‌ర్ లోని ఇళ్లల్లోకి వ‌‌ర్షపు నీరు చేరింది. గాయత్రీనగర్, రేకుర్తి ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొనరావుపేటలో ఒర్రెలు ప్రవహిస్తుండడంతో పొలాలు నీట మునిగాయి. నిమ్మపల్లి ప్రధాన రహదారి కొండాపూర్ పెంటివాగు కాజ్​వే మళ్లీ తెగి రాకపోకలు స్తంభించాయి. మర్తనపేటలో ఒర్రె పొంగి పొలాలన్నీ కొట్టుకుపోయాయి. జమ్మికుంట పట్టణంలోని లోతట్ట ప్రాంతాలైన హౌసింగ్ బోర్డు కాలనీ, అంబేద్కర్ కాలనీవాసులు అప్రమత్తమయ్యారు. కొత్తపల్లి పట్టణ శివారు రోడ్​డ్యాం ఉప్పొంగుతోంది. దీంతో రెండు రోజులుగా రాకపోకలకు బంద్ అయ్యాయి. వాహనాలను రేకుర్తి శాతవాహన యూనివర్సిటీ మీదుగా పోలీసులు దారి మళ్లిస్తున్నారు. గంగాధర మండలం గట్టుభూత్కూర్, రామడుగు మండలం వెలిచాల, వెదిర, కొత్తపల్లి పట్టణ చెరువులు నిండుకుండల్లా మారాయి. 


రైతు ఆత్మహత్యలన్నీ  ప్రభుత్వ హత్యలే
కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

కోనరావుపేట,వెలుగు:  రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం బావుసాయిపేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు ఎక్కల్దేవి పర్శరాములు కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు పక్షపాతి అని చెప్పుకునే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఫిరోజ్ పాషా, లీడర్లు నందుగౌడ్, అశోక్,  శ్రీనివాస్, అనిల్, పోషయ్య, దేవయ్య, దినకర్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

వెల్గటూర్, వెలుగు: రోడ్డు యాక్సిడెంట్ లో ఒకరు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో జరిగింది. పైడిపల్లి గ్రామానికి చెందిన కొంగ రాజేశం(45) శనివారం గ్యాస్ పొయ్యి రిపేర్ కోసం ధర్మారం వెళ్లి వస్తుండగా పైడిపల్లి స్టేజ్ వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజేశం అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య కూతురు, కొడుకు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదు
సీనియర్ సైకాలజిస్ట్​ అశోక్

పెద్దపల్లి, వెలుగు: ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్, సీనియర్ సైకాలజిస్ట్ పరికిపండ్ల అశోక్ అన్నారు. పెద్దపల్లిలోని గాయత్రి డిగ్రీ కాలేజీలో శనివారం ఏర్పాటు చేసిన మోటివేషన్ ప్రోగ్రాంలో అశోక్​మాట్లాడారు. ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణ దినాన్ని పురస్కరించుకొని, సెప్టెంబర్ -10 నుంచి అక్టోబర్ 10 వరకు రాష్ట్రవ్యాప్త సెమినార్​లు నిర్వహిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఆడిటోరియంలో ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో గాయత్రి డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ అల్లెంకి శ్రీనివాస్, పి.వేణు, యోగాచార్యులు ముల్క ఐలయ్య, దామోదర్, రేవంత్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ యుగంధర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. 

మౌలిక  వసతులకు పెద్దపీట
ఎంపీ బండి సంజయ్ 

హుజూరాబాద్, వెలుగు: గ్రామాలలో మౌలిక  వసతులకు మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. శనివారం శంకరపట్నం మం డలం పాపయ్య పల్లె, లింగాపూర్ గ్రామాల్లో ఈజీఎస్ కింద మంజూరైన రూ.33 లక్షల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. గ్రామాల్లోని ఇంటర్నల్ సీసీ డ్రైన్​లు, రోడ్లు ఈజీఎస్ నిధులతో చేపడుతున్నారని పేర్కొన్నారు. పాపయ్యపల్లిలో రూ.20లక్షలతో, లింగాపూర్ లో రూ.13 లక్షలతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. అనంతరం కేశపట్నం, సైదాపూర్ మండలాధ్యక్షులు ఐలయ్య, శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, లీడర్లు పాల్గొన్నారు.