మోదీజీ.. ఏం దాస్తున్నరు?.. చైనా ఆక్రమణలను కప్పిపుచ్చుతున్నారా?: అసద్

మోదీజీ.. ఏం దాస్తున్నరు?.. చైనా ఆక్రమణలను కప్పిపుచ్చుతున్నారా?: అసద్

హైదరాబాద్, వెలుగు : లడఖ్  సరిహద్దుల్లో భద్రతను చీకట్లోకి నెట్టేసి చైనా ప్రెసిడెంట్​తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశాలు నిర్వహిస్తున్నారని హైదరాబాద్​ ఎంపీ, మజ్లిస్  చీఫ్  అసదుద్దీన్​ ఒవైసీ ఆరోపించారు. ఏం దాస్తున్నారని మోదీని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. సరిహద్దుల్లో సంక్షోభం పరిష్కారమైందంటూ ఆర్మీపై మోదీ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తెస్తున్నదని నిలదీశారు. చైనా ఆక్రమణలను ఎందుకు కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని ప్రశ్నించారు.

40 నెలలుగా సైనికులు సరిహద్దుల వద్దే ఉంటున్నారు. చైనా బెదిరింపులకు తలొగ్గకుండా డ్యూటీలు చేస్తున్నారు. మన సైనికులపై నమ్మకం ఉంచి చైనా ప్రెసిడెంట్  షీ జిన్ పింగ్ ను ఎందుకు నిలదీయడం లేదు? ఈ లెక్కన చైనాకు భూమిని అప్పగించినట్టేనా? సరిహద్దు విషయంలో మోదీ ప్రభుత్వం చైనా ముందు మోకరిల్లడం సిగ్గుచేటు. అది దేశానికే ప్రమాదకరం” అని ఒవైసీ వ్యాఖ్యానించారు. దేశమేమీ మోదీ ప్రైవేటు ఆస్తి కాదని, ఇది దేశ భద్రతకు సంబంధించిందని అన్నారు. దీనిపై పార్లమెంటులో​ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆయన డిమాండ్​ చేశారు.