ట్రాన్స్​పోర్టేషన్​ కోసం భారీ ఖర్చు

ట్రాన్స్​పోర్టేషన్​ కోసం భారీ ఖర్చు

న్యూఢిల్లీ: మన దేశం ఐదు ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి  రవాణా సదుపాయాలను పెంచడం కీలకమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రోడ్డు ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేయడానికి రెడీ అయింది.  ఇండియా ఈ ఏడాది తన జీడీపీలో అత్యధికంగా 1.7 శాతం రవాణా మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయనుంది. అమెరికా,  చాలా ఐరోపా దేశాలతో పోలిస్తే ఈ ఖర్చు దాదాపు రెండు రెట్లు ఎక్కువని ‘ది ఎకనామిస్ట్’ కామెంట్​ చేసింది. ఇన్​ఫ్రాకు ఇంత భారీగా ఖర్చు పెట్టడం అద్భుతమని పేర్కొంది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి మౌలిక సదుపాయాలపై మూలధన వ్యయాన్ని 122 బిలియన్ డాలర్లకు పెంచింది. 

ప్రస్తుతం గ్లోబల్​ మార్కెట్లలో స్లోడౌన్​ కనిపిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్​ఫ్రాకు భారీ కేటాయింపుల వల్ల ఎకానమీ పరుగులు పెట్టడంతోపాటు చాలా మందికి ఉపాధి దొరుకుతుందని భావిస్తోంది. మోడీ ప్రభుత్వం రైల్వేలకు మూలధన ఖర్చుల కోసం రూ. 2.4 లక్షల కోట్లు కేటాయించింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చుతో పోలిస్తే ఇది తొమ్మిది రెట్లు ఎక్కువ. ఈ నిధులను ఎక్కువగా ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కొత్త కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఎలక్ట్రిఫికేషన్​, రైల్వే స్టేషన్లలో సౌకర్యాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రోడ్ల ప్రాజెక్టులకు ఖర్చు 36 శాతం పెరిగి రూ.2.7 లక్షల కోట్లకు చేరుకుంటుంది. రీజనల్​ కనెక్టివిటీని మెరుగుపరచడానికి 50 అదనపు విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వాటర్ ఏరోడ్రోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పునరుద్ధరించడంపై కూడా మోడీ ప్రభుత్వం ఫోకస్​ చేసింది.