
ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్
ప్రధాని మోడీతో కలిసి జాయింట్ ప్రెస్ మీట్
ఇరు దేశాల మధ్య కుదిరిన నాలుగు కీలక ఒప్పందాలు
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలో ఉంటున్న ఇండియన్లసేఫ్టీపై ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్ హామీ ఇచ్చారని మోడీ చెప్పారు. వారి అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారన్నారు. ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై జరిగిన దాడుల గురించి ఆంటోనీతో ప్రస్తావించానని తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మన దేశానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ తో శుక్రవారం ప్రధాని మోడీ భేటీ అయ్యారు. చర్చల తర్వాత ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘కొన్ని వారాలుగా ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ న్యూస్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేసింది. దీనిని అల్బనీస్ దృష్టికి తీసుకెళ్లా. ఇండియన్స్ సేఫ్టీకి ఆయన హామీ ఇచ్చారు. అధికారులతో రోజూ మాట్లాడుతున్నానని, అక్కడున్న భారతీయులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు” అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
జీ-20 సమిట్‌కు ఆహ్వానించా..
స్పోర్ట్స్, ఇన్నోవేషన్, ఆడియో విజువల్ ప్రొడక్షన్, సోలార్ పవర్ రంగాల్లో సహకారం అందించేందుకు డీల్ కుదిరిందని మోడీ వివరించారు. రెండు దేశాల మధ్య క్లీన్ ఎనర్జీ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, ఖనిజాలు, మైగ్రేషన్, మొబిలిటీ, సప్లై చైన్, ఎడ్యుకేషన్, కల్చర్ రంగాల్లో సహకారం పెంచుకునేందుకు నిర్ణయించామన్నారు. ఇండియా – ఆస్ట్రేలియా కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్కు ద్వైపాక్షిక భద్రతా సహకారం ముఖ్యమైన పిల్లర్ అని అన్నారు. ఇండో – పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులపై కూడా చర్చించినట్లు వివరించారు. రక్షణ రంగంలో కొన్నేండ్లుగా ఆస్ట్రేలియాతో కీలక ఒప్పందాలు చేసుకున్నామన్నారు. సెప్టెంబర్‌లో జరిగే జీ20 సమిట్‌కు రావాలని ఆంటోనీని ఆహ్వానించానని తెలిపారు. మేలో జరిగే క్వాడ్ సమిట్‌కు రావాల్సిందిగా ఆంటోనీ తనను
ఆహ్వానించారని చెప్పారు.
డీల్ గర్వంగా భావిస్తున్నా..: ఆంటోని
ఇండియా- ఆస్ట్రేలియా మధ్య ఎకనామిక్ కో ఆపరేషన్ ట్రేడ్ అగ్రిమెంట్(ఈసీటీఏ) త్వరగా పూర్తి చేసేందుకు మోడీ అంగీకరించారని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ తెలిపారు. ఇండియాతో ఎకనామిక్ రిలేషన్షిప్ మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయించామన్నారు. వాణిజ్య ఒప్పందాలు అమల్లోకొస్తే ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుందని వివరించారు. సోలార్, హైడ్రోజన్ రంగాల్లో ఇండియా సహకారం పొందుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ డీల్‌లోని నిబంధనలు మార్చుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. వరల్డ్ సేఫ్టీ, క్లైమేట్‌పై కూడా చర్చించామన్నారు. కొత్త మైగ్రేషన్ విధానం స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్లు, రీసెర్చర్స్, బిజినెస్ పర్సన్స్, ఇతర ప్రొఫెషనల్స్‌కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
మహిళలను గౌరవిస్తేనే అభివృద్ధి : మోడీ
తమ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మహిళలు ఎంతో అభివృద్ధి చెందారని మోడీ చెప్పారు. మహిళలను గౌరవించే దేశమే ప్రగతి సాధిస్తుందని తెలిపారు. దేశాభివృద్ధి లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో భాగంగా ‘మహిళా సాధికారత’ అంశంపై మోడీ మాట్లాడారు. ఇంజనీరింగ్, సైన్స్, మ్యాథ్స్ , టెక్నాలజీ రంగాల్లో మహిళల ఎన్రోల్మెంట్ 43% గా ఉందన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. ముద్ర స్కీం కింద రుణం తీసుకున్నోళ్లలో 70% మంది మహిళలేనని చెప్పారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ ఏడాది బడ్జెట్ తొలి మెట్టు అని తెలిపారు. హెల్త్, స్పోర్ట్స్, బిజినెస్, పొలిటికల్ రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరిగిందన్నారు.