నేను హామీ ఇస్తున్నా..మహిళా బిల్లును చట్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నం

నేను హామీ ఇస్తున్నా..మహిళా బిల్లును చట్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నం
  •   గొప్ప పనుల కోసందేవుడు నన్ను ఎంచుకున్నడు: ప్రధాని మోదీ
  •     బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఉభయ సభల ఎంపీలకు పిలుపు

న్యూఢిల్లీ :  లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ, అసెంబ్లీల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ నిర్ణయం భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఉభయ సభల ఎంపీలకు పిలుపునిచ్చారు. మంగళవారం కొత్త పార్లమెంటు భవనంలో ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్ స్పీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారు. మహిళా బిల్లును కేంద్ర కేబినెట్ సోమవారం నాడు ఆమోదించిందని తెలిపారు. దేశ అభివృద్ధి ప్రక్రియలో మరింత మంది మహిళలు భాగస్వాములు కావాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని చెప్పారు. అంతరిక్షం నుంచి క్రీడల వరకు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి స్వయం సహాయక బృందాల వరకు అపార సహకారాన్ని మహిళలు అందించారని కొనియాడారు.

ఏండ్లుగా అనేక చర్చలు, వివాదాలు 

‘‘నారీశక్తి వందన్ అధినియం విషయంలో దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలను అభినందిస్తున్నా. ఈ బిల్లును చట్టంగా మార్చడానికి మేం కట్టుబడి ఉన్నామని నేను హామీ ఇస్తున్నా” అని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఎన్నో ఏండ్లుగా మహిళా రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అనేక చర్చలు, వివాదాలు జరుగుతున్నాయి. మహిళా రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇంతకుముందు కూడా పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనేక ప్రయత్నాలు జరిగాయి. 1996లో దీనికి సంబంధించిన తొలి బిల్లును ప్రవేశపెట్టారు. అటల్ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి హయాంలో ఎన్నోసార్లు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినా.. అది కార్యరూపం దాల్చలేదు.

Also Raed : 27 ఏండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న బిల్లుకు కదలిక

అప్పుడు ఆ కల నెరవేరకుండానే మిగిలిపోయింది” అని చెప్పారు. ‘‘మహిళల హక్కులకు భరోసా కల్పించేందుకు, వారి శక్తిని ఉపయోగించుకునేందుకు, ఇంకెన్నో ముఖ్యమైన, గొప్ప పనుల కోసం దేవుడు నన్ను ఎంచుకున్నాడు. నిన్న (సోమవారం) మంత్రివర్గంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది. సెప్టెంబర్ 19 చరిత్రలో నిలిచిపోతుంది’’ అని అన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాల లక్ష్మణరేఖను మనమందరం పాటించాలని సూచించారు. ‘‘ఈ సభ ఏ రాజకీయ పార్టీ ప్రయోజనానికో ఉద్దేశించినది కాదు. దేశ అభివృద్ధికి ఉద్దేశించినది. దేశానికి సేవ చేసేందుకు పార్లమెంటు అత్యున్నత స్థానం” అని చెప్పారు.

మహిళా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించండి 

మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని రాజ్యసభ సభ్యులను ప్రధాని మోదీ కోరారు. కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాజ్యసభ ఫస్ట్ సిట్టింగ్ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘‘మహిళా బిల్లు బుధవారం లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో చర్చకు వస్తుంది. బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నా” అని అన్నారు. ‘‘ఈ రోజు (మంగళవారం) చిరస్మరణీయమైన, చారిత్రాత్మకమైన రోజు. ఇది కేవలం కొత్త పార్లమెంటు బిల్డింగ్ మాత్రమే కాదు.. కొత్త ప్రారంభానికి చిహ్నం’’ అని చెప్పారు.