27 ఏండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న బిల్లుకు కదలిక

27 ఏండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న బిల్లుకు కదలిక
  • కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం
  • కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత
  • సభ ముందుకు.. ఇయ్యాల లోక్‌‌సభలో చర్చ
  • బిల్లుకు ‘నారీ శక్తి వందన్ అధినియం’గా పేరు
  • 15 ఏండ్ల పాటు కొనసాగనున్న రిజర్వేషన్లు
  • విధానాల రూపకల్పనలో మహిళల
  • భాగస్వామ్యం పెరుగుతుందన్న కేంద్రం
  • మెజారిటీ పార్టీలు అనుకూలం..
  • లోక్‌‌సభలో ఈజీగా పాస్‌‌ అయ్యే చాన్స్‌‌

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 27 ఏండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సోమవారం కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పార్లమెంటు బిల్డింగ్‌‌లో సమావేశాలు ప్రారంభమైన మంగళవారం నాడే లోక్‌‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌‌సభ, అసెంబ్లీల్లో 33% సీట్లను మహిళలకు కేటాయించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్ అధినియం’ అని పేరు పెట్టింది. ఈ బిల్లుతో విధానాల రూపకల్పన విషయంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా అవతరించడానికి సాయపడుతుందని కేంద్రం చెప్పింది. ‘‘పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళల సంఖ్య పెరిగిం ది. కానీ అసెంబ్లీలు, పార్లమెంటులో తక్కువగా ఉంది. ఈ బిల్లుతో సభల్లో నిర్ణయాలు తీసుకోవడంలో క్వాలిటీని మహిళలు మెరుగుపరుస్తారు” అని ఆశాభావం వ్యక్తం చేసింది.

Also Raed : నిజామాబాద్ జిల్లాలో డెంగీ కలకలం

మహిళా బిల్లును ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాజకీయ పార్టీలు కూడా స్వాగతించాయి. మెజారిటీ పార్టీలు అనుకూలంగా ఉండటంతో లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో సులభంగానే ఈ బిల్లు పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యే అవకాశం ఉంది. అయితే మహిళా రిజర్వేషన్లు ఇప్పుడప్పుడే అమల్లోకి వచ్చే అవకాశం లేదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమల్లోకి రానున్నాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్లు 15 ఏండ్ల పాటు కొనసాగేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఆ తర్వాత వీటిని పెంచుకునేందుకు అవకాశం ఉంది.

ఇయ్యాల్టికి లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ వాయిదా

మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.. లోక్ సభలో ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో మహిళా సభ్యుల సంఖ్య 181కి పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం 82 మంది మహిళా సభ్యులు ఉన్నారని తెలిపారు. తర్వాత సభ బుధవారానికి వాయిదా పడింది. అంతకుముందు స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. పాత పార్లమెంటు భవనం ఇకపై ‘సంవిధాన్ సదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా కొనసాగుతుందని చెప్పారు. ఇక మహిళా బిల్లుపై బుధవారం చర్చ జరగనుంది. తర్వాత ఓటింగ్ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఇందుకోసం 6 గంటల సమయాన్ని కేటాయిస్తూ  బీఏసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో ఈ బిల్లును గురువారం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఈ రాష్ట్రాల్లో 10 శాతం లోపే

మొత్తం 543 మంది సభ్యులున్న ప్రస్తుత లోక్‌‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 15 శాతం కంటే తక్కువే. రాజ్యసభలోనూ 14 శాతమే మహిళా ప్రాతినిధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పుదుచ్చేరి అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం 10 శాతం లోపే ఉంది. ఇక బీహార్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీ, ఢిల్లీ అసెంబ్లీల్లో ప్రస్తుతం 10 నుంచి 12 శాతం మంది మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. చత్తీస్‌‌గఢ్‌‌లో అత్యధికంగా 14.4 శాతం, వెస్ట్ బెంగాల్‌‌లో 13.7 శాతం, జార్ఖండ్‌‌లో 12.35 శాతం మహిళల ప్రాతినిధ్యం ఉంది.   

నేను హామీ ఇస్తున్నా

నారీ శక్తి వందన్ అధినియం విషయంలో దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలను అభినందిస్తున్నా. ఈ బిల్లును చట్టంగా మార్చడానికి మేం కట్టుబడి ఉన్నామని నేను హామీ ఇస్తున్నా. మహిళల హక్కులకు భరోసా కల్పించేందుకు, వారి శక్తిని ఉపయోగించుకునేందుకు, ఇంకెన్నో ముఖ్యమైన, గొప్ప పనుల కోసం దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ఈ దిశగా మా ప్రభుత్వం మరోసారి అడుగు వేసింది. సెప్టెంబర్ 19 చరిత్రలో నిలిచిపోతుంది. లోక్‌‌సభ, అసెంబ్లీల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చినం.  ఈ నిర్ణయం భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది.

- ప్రధాని నరేంద్ర మోదీ

అది మాదే :  సోనియా మహిళా

 రిజర్వేషన్ బిల్లు తాము తెచ్చినదేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. మంగళవారం పార్లమెంటుకు వస్తున్న సమయంలో మీడియా ప్రశ్నించగా.. ‘‘అది మాదే” అని చెప్పి వెళ్లిపోయారు.