జపాన్ మాజీ ప్రధాని షింజో అబె పరిస్థితి విషమం

జపాన్ మాజీ ప్రధాని షింజో అబె పరిస్థితి విషమం

జపాన్ మాజీ ప్రధాని షింజో అబె పరిస్థితి విషమంగా ఉందన్నారు ఆదేశ ప్రధాని ఫ్యుమియో కిషిదా. జపాన్ లోని నరా సిటీలోని యమాటో సైదాయిజి స్టేషన్ ముందు స్పీచ్ ఇస్తున్న టైంలో షింజో అబెపై కాల్పులు జరిగాయి. దీంతో ఒక్కసారిగా షింజో అబె కుప్పకూలిపోయారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రసంగిస్తున్న టైంలో కాల్పులు జరిపారు. తుపాకీ పేలిన శబ్ధం వినిపించిందని స్థానికులు తెలిపారు. రక్తం కారుతున్న అబెను స్థానిక హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హాస్పిటల్ కు తరలిస్తున్న టైంలో షింజోలో ఎలాంటి కదలికలు లేవని ఫైర్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు తెలిపారు.

షింజో అబెను వెనక నుంచి కాల్చినట్లు భావిస్తున్నారు అధికారులు. గాయపడిన షింజోను హెలికాప్టర్ లో నరా మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ కు తరలించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారా సిటీకి చెందిన 41 ఏళ్ల టెట్ సుయా యమగామిగా గుర్తించారు అధికారులు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని ఈ ఘటన గురించి తెలుసుకుని టోక్యో చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన కార్డియో పల్మనరీ అరెస్ట్ స్థితిలో ఉన్నారని టోక్యో మాజీ గవర్నర్ తెలిపారు.

కాల్పుల్లో గాయపడిన షింజో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపింది జపాన్ మీడియా. షింజో అబెపై కాల్పుల ఘటనను ఖండించారు ఆదేశ ప్రధాని. అబెను కాపాడేందుకు డాక్టర్లు కృషి చేస్తున్నారన్నారు జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా. కాల్పుల చర్యను అనాగరిక చర్య అని.. దీన్ని సహించబోమన్నారు. షింజో అబెపై దాడి పట్ల ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. అబె, ఆయన కుటుంబసభ్యులు, జపాన్ ప్రజల వెంట తన ప్రార్థనలు ఉంటాయన్నారు మోడీ. షింజో అబెపై జరిగిన దాడి పై విచారం వ్యక్తం చేసింది వైట్ హౌస్. దాడి వార్తను నిశితంగా పరిశీలిస్తున్నామంది. కాల్పులపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.