అన్ని అంశాలపైనా పార్లమెంట్ లో మాట్లాడుకుందాం..!

అన్ని అంశాలపైనా పార్లమెంట్ లో మాట్లాడుకుందాం..!

న్యూఢిల్లీపార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కానుండటంతో గురువారం న్యూఢిల్లీలో ఎన్డీఏ.. ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి, పలు అంశాలపై చర్చించింది. ప్రతి అంశంపై నిర్మాణాత్మక చర్చ జరగాలని ప్రధాని మోడీ చెప్పినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి  సమావేశం తర్వాత మీడియాకు వెల్లడించారు. దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై సెషన్​ దృష్టి సారించాలని చాలా మంది సభ్యుల సూచనలను మోడీ స్వాగతించారని, ఇతర ముఖ్యమైన అంశాలపై బహిరంగ చర్చ జరగాలని ఆయన కోరుకున్నారని తెలిపారు. జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి  పీఎం మోడీ, రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్, సీనియర్ మంత్రులు ఆనంద్ శర్మ, కాంగ్రెస్ నుంచి గులాంనబీ ఆజాద్, టీఎంసీకి చెందిన సుదీప్ బందోపాధ్యాయతో పాటు ఇతర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. సిటిజన్ షిప్ అమెండ్​మెంట్ యాక్ట్(సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలతో పాటు ఎన్డీఏ లోని కొంతమంది సభ్యులు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్​పీఆర్​), సీఏఏపై పలు సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీ మిత్రపక్షాలైన జనతాదళ్(యునైటెడ్), శిరోమణి అకాలీదళ్(ఎన్​డీ)లు సమావేశంలో సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడాయి.

సీఏఏ, ఎన్నార్సీలపై చర్చనే లేదు: గులాంనబీ ఆజాద్

‘‘సమావేశంలో ముఖ్యమైన బిల్లుల ఆమోదంపై  మాత్రమే కేంద్రం దృష్టి ఉంది. కానీ మేం పడిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం, కాశ్మీర్ పరిస్థితి అంశాలను కూడా చర్చకు తీసుకువచ్చాం’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ సమావేశం తర్వాత విలేకరులతో అన్నారు. సీఏఏ, ఎన్నార్సీ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయని, అయితే వారి ఆందోళనలపై ప్రభుత్వం
స్పందించలేదన్నారు.

సీఏఏ, కాశ్మీర్ అంశాలే టార్గెట్

రెండోసారి మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఇదే మొదటి పూర్తి బడ్జెట్ సెషన్.  ఇందులో రాబోయే ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కీలక విధానాలను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు దాడికి సిద్ధమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన సమస్యలు, జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో రాజకీయ నాయకులను నిర్బంధించడం, ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ బ్యాన్, నార్త్ ఈస్ట్‌‌లో ఎన్నార్సీ, ఎన్‌‌‌‌‌‌‌‌పీఆర్​కు సంబంధిందిచిన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు  కాంగ్రెస్, ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి.