
- ప్రధాని ధ్యాసంతా లోక్సభ స్పీకర్ ఎన్నికపైనే ఉంది: రాహుల్ గాంధీ
- బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో దేశ విద్యావ్యవస్థ.. అందుకే పేపర్ లీకేజీలు జరుగుతున్నయ్
- పేపర్ లీకేజీలపై పార్లమెంట్లో ప్రశ్నిస్తానని ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో విద్యావ్యవస్థ సర్వనాశనమైందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధాన్ని ఆపిన ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పేపర్ లీకేజీలను మాత్రం ఆపలేకపోయారని ఆయన సెటైర్ వేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో రాహుల్ మాట్లాడారు. యూజీసీ నెట్ ఎగ్జామ్లో అవకతవకలు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర ప్రభు త్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘రష్యా, ఉక్రెయిన్.. ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధాలను ప్రధాని మోదీ ఆపారని చెప్పేవారు. కానీ ఆయన మన దేశంలో పేపర్ లీకేజీలను మాత్రం ఆపలేకపోయారు. అసలు పేపర్ లీకేజీలను ఆపాలని కూడా అనుకోలేదు” అని కామెంట్ చేశారు. దేశంలోని విద్యాసంస్థలన్నింటినీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని.. అందువల్లే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘‘మన విద్యావ్యవస్థ మొత్తం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంత్రణలో ఉంది. మెరిట్ ప్రాతిపదికన యూనివర్సిటీల వీసీలను నియమించడం లేదు. ఆర్ఎస్ఎస్ కు చెందినోళ్లనే నియమిస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నాయి. ఆ రెండింటి చేతుల్లో నుంచి విద్యావ్యవస్థను విడిపించనంత కాలం పేపర్ లీకేజీలు జరుగుతూనే ఉంటాయి” అని అన్నారు.
మోదీ మానసికంగా దెబ్బతిన్నరు..
లోక్ సభ ఎన్నికల రిజల్ట్ తర్వాత ప్రధాని మోదీ శారీరకంగా, మానసికంగా దెబ్బతిన్నారని రాహుల్ అన్నారు. ప్రభుత్వాన్ని నడపడం కోసం అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. ‘‘పేపర్ లీకేజీలు జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన ధ్యాసంతా స్పీకర్ ఎన్నికపైనే ఉంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పై ఆయనకు ఎలాంటి బాధ లేదు. స్పీకర్ పోస్టు దక్కించుకోవడంపైనే దృష్టి పెట్టారు” అని విమర్శించారు. ప్రజలను భయపెడుతూ మోదీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంటారని, కానీ ఇప్పుడు ప్రజలు ఆయనకు భయపడడం లేదని అన్నారు. ‘‘నేను భారత్ జోడో న్యాయ్ యాత్ర చేసినప్పుడు దేశంలో పేపర్ లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని స్టూడెంట్లు చెప్పారు. ఇప్పుడు ఒక పేపర్ (యూజీసీ నెట్) రద్దు చేశారు. ఇక నీట్ విషయంలో ఏం జరుగబోతున్నదో మనకు తెలియదు” అని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కారణంగా లక్షలాది మంది స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ల భవిష్యత్తు నాశనం అవుతున్నదని ఆయన మండిపడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే)కి కేంద్ర విద్యాశాఖ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు.
వ్యాపమ్ స్కామ్ విస్తరణకు ప్లాన్..
పేపర్ లీకేజీలకు మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ కేంద్రాలుగా మారాయని రాహుల్ ఆరోపించారు. గతంలో మధ్యప్రదేశ్ లో వ్యాపమ్ కుంభకోణం జరిగిందని, దాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నారని అన్నారు. పేపర్ లీకేజీల అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతామని చెప్పారు. ఇందుకు కారణమైనోళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.