మోడీ గెలవగ.. మార్కెట్‌‌లో పండుగ

మోడీ గెలవగ.. మార్కెట్‌‌లో పండుగ

దలాల్‌‌‌‌స్ట్రీట్‌‌‌‌లో లాభాల వర్షం

 సెన్సెక్స్ 623 పాయింట్లు జంప్

 11,844 వద్ద నిఫ్టీ ముగింపు

ముంబై : నరేంద్ర మోడీ విక్టరీతో మార్కెట్ పండుగ చేసుకుంటోంది. దలాల్ స్ట్రీట్‌‌‌‌లో లాభాల వర్షం కురుస్తూనే ఉంది. మార్కెట్ రికార్డు బద్దలు కొడుతూ చరిత్ర సృష్టిస్తోంది. ప్రారంభంలోనే 400 పాయింట్లకు పైగా లాభంతో దూసుకొచ్చిన సెన్సెక్స్… ట్రేడింగ్ ముగిసే సమయానికి మరింత పుంజుకుంది. సెన్సెక్స్ శుక్రవారం 623 పాయింట్లు లాభపడి  39,434.72 వద్ద రికార్డు స్థాయిలో ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లకు భారీ సంపద వచ్చి చేరింది. మళ్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే క్లియర్ మెజార్టీ అందుకోవడంతో… పాలసీల్లో స్థిరత్వం ఏర్పడుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. నిఫ్టీ కూడా 187 పాయింట్లు జంప్ చేసి, తాజా జీవితకాల గరిష్ట స్థాయి11,844.10 వద్ద క్లోజైంది.

లోక్‌‌‌‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ వారమంతా మార్కెట్ జోరుగా హుషారుగా సాగింది. ఏకంగా సెన్సెక్స్ ఈ వారంలో 1,503 పాయిట్ల మేర లాభపడింది. నిఫ్టీ కూడా 437 పాయింట్ల లాభాల వర్షం కురిపించింది. గురువారం ఓట్ల లెక్కింపు సాగుతోన్న సమయంలో సెన్సెక్స్, నిఫ్టీ రెండు సూచీలు ఇంట్రాడేలో ఆల్‌‌‌‌ టైమ్ హైలను చేరుకున్నాయి. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సొంతంగానే 303 సీట్లు కైవసం చేసుకుని మళ్లీ అధికారం తనదేనని చాటిచెప్పింది. 1984 నుంచి సింగిల్ పార్టీకి బ్యాక్ టూ బ్యాక్ మెజార్టీ రావడం ఇదే తొలిసారి.

సూచీలన్నీ లాభాల్లోనే…

సెన్సెక్స్ ప్యాక్‌‌‌‌లో ఐసీఐసీఐ షేరు బాగా లాభపడింది. దాని తర్వాత ఎల్‌‌‌‌ అండ్ టీ, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్,  వేదంతా, టాటా మోటార్స్ షేర్లు 4.60 శాతం వరకు లాభాలు పండించాయి. ఎన్‌‌‌‌టీపీసీ, హెచ్‌‌‌‌సీఎల్ టెక్, టీసీఎస్‌‌‌‌, హెచ్‌‌‌‌యూఎల్‌‌‌‌ షేర్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 39,076.28 వద్ద ప్రారంభమైంది. 39,476.97 వద్ద గరిష్ట స్థాయిని, 38,824.26   వద్ద కనిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ 11,748.00 వద్ద ప్రారంభమై, 11,859.00 వద్ద గరిష్ట స్థాయిని, 11,658.10 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, టెలికాం, ఆటో సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. బీఎస్‌‌‌‌ఈ మిడ్‌‌‌‌క్యాప్ 2.01 శాతం, బీఎస్‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌క్యాప్ 2.42 శాతం పెరిగాయి.