రెండంకెల స్థాయిలో షేర్లు ర్యాలీ
న్యూఢిల్లీ : 2022 వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంకణం కట్టుకోవడంతో.. పేపర్ కంపెనీలకు జోష్ వచ్చింది. దుకాణాలు,వ్యాపారాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లను తీసివేయాలని ప్రకటన వెలువడిన తర్వాత… చాలా పేపర్ కంపెనీల స్టాక్స్ ఊపందుకున్నాయి. సెప్టెంబర్ నుంచి చాలా పేపర్ కంపెనీల షేర్లు రెండంకెల సంఖ్యలో ర్యాలీ చేశాయి. మలు పేపర్ మిల్స్ స్టాక్ అయితే ఏకంగా 95 శాతం మేర పెరిగింది. ఆగస్ట్ 30న రూ.20గా ఉన్న ఈ కంపెనీ షేరు విలువ సెప్టెంబర్ 30 నాటికి రూ.38.90కు పెరిగింది.
స్టార్ పేపర్ మిల్స్, పుదుంజి పేపర్ ప్రొడక్ట్స్, బాలక్రిష్ణ పేపర్ మిల్స్, హైటెక్ వైండింగ్ సిస్టమ్స్ , జీనస్ పేపర్ అండ్ బోర్డ్స్ కంపెనీల స్టాక్స్ 50 శాతం నుంచి 85 శాతం లాభపడ్డాయి. ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ ప్రొడక్ట్‌లు వాడితే భారీ పెనాల్టీలు పడుతున్నాయి. అక్టోబర్ 2నుంచి ప్లాస్టిక్ బ్యాన్ అని రిపోర్ట్‌లు రావడంతో, పేపర్ కంపెనీల షేర్ల పెరుగుదలకు దోహదం చేసిందని కొటక్ సెక్యురిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ రుస్మిక ఓజా చెప్పారు. పేపర్ వాడకాన్ని పెంచడానికి పాన్ ఇండియా బేసిస్‌లో ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యాన్‌ను అమలు చేయబోతుందని పేర్కొన్నారు.ఈ బ్యాన్ నుంచి ప్రత్యక్షంగా లబ్ది పొందే కంపెనీల వైపుకే ఇన్వెస్టర్లు దృష్టిసారించాలని ఆయన సూచించారు.
జేకే పేపర్,ఇమామీ పేపర్, సౌత్ ఇండియా పేపర్ మిల్స్,తమిళనాడు న్యూస్‌ప్రింట్‌లు గత నెలలో 10 శాతానికి పైగా లబ్ది పొందాయి. ‘ప్లాస్టిక్‌ను బ్యాన్ చేస్తుండటంతో పేపర్‌కు డిమాండ్ పెరుగుతుంది. పేపర్ ఇక బెస్ట్ కమోడిటీగా పేరొందనుంది. పేపర్ కంపెనీలకు మంచి మార్జిన్లు వస్తాయి. రాబోయే ఏడాది కాలానికి పేపర్ షేర్ల ధరలపై మేము బుల్లిష్‌గా ఉన్నాం. పేపర్ సెగ్మెంట్‌లో ఐటీసీ, ట్రెడెంట్,జేకే పవర్‌లను టాప్ పికప్‌లుగా నిర్ణయిస్తున్నాం’ అని ఐఐఎఫ్‌ఎల్ ఈవీపీ మార్కెట్స్ సంజీవ్ బాసిన్ చెప్పారు.

