వికసిత్ భారత్ మోదీ లక్ష్యం: కేంద్ర మంత్రి మురుగన్

వికసిత్  భారత్  మోదీ లక్ష్యం: కేంద్ర మంత్రి మురుగన్

అయిజ/కందనూలు, వెలుగు: వికసిత్  భారత్  మోదీ లక్ష్యమని, దీని కోసం ఆయన నిర్విరామంగా కృషి చేస్తున్నాడని కేంద్ర మంత్రి ఎల్  మురుగన్  తెలిపారు. గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని ఎంబీఆర్  ఫంక్షన్  హాల్​లో మంగళవారం మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజా ఆశీర్వాద సభకు ఎమ్మార్పీఎస్  వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, నాగర్ కర్నూల్  ఎంపీ క్యాండిడేట్​ పోతుగంటి భరత్ తో కలిసి హాజరయ్యారు.

నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్నిరంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత మోదీదేనన్నారు. 370 ఆర్టికల్ రద్దు, రామాలయ నిర్మాణం, ట్రిపుల్  తలాక్  వంటి అంశాలు చారిత్రాత్మకమన్నారు. 

మాదిగలను పార్లమెంట్​లో కనిపించకుండా కాంగ్రెస్  కుట్ర చేస్తోందన్నారు. మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని, నాగర్ కర్నూల్  ఎంపీగా భరత్ ప్రసాద్ ను గెలిపించాలని కోరారు. సోమశిల, సిద్ధేశ్వరం బ్రిడ్జి పూర్తి చేసి పర్యాటక అభివృద్ధితో పాటు రెండు రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. కొల్లాపూర్  మామిడికి అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్  కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నెడనూరి దిలీపాచారి, నారాయణచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కార్యదర్శి జలగరి అశోక్, గొంగళ్ల రంజిత్ కుమార్  పాల్గొన్నారు.