మోదీ తెలంగాణ టూర్‌‌‌‌ ఖరారు.. ఈ నెల 25 నుంచి 27 వరకు రాష్ట్రంలో పర్యటన

మోదీ తెలంగాణ టూర్‌‌‌‌ ఖరారు.. ఈ నెల 25 నుంచి 27 వరకు రాష్ట్రంలో పర్యటన
  • కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో రేపు ప్రధాని సభలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రధాని మోదీ ప్రచార షెడ్యూల్‌‌ ఖరారైంది. ఈ నెల 25 నుంచి 27 వరకు ఆరు సభలు, ఒక రోడ్‌‌ షోలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ మేరకు బీజేపీ స్టేట్‌‌పార్టీ గురువారం షెడ్యూల్‌‌ విడుదల చేసింది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గంలో మోదీ ప్రచార సభలను నిర్వహించనున్నారు. బీజేపీ గెలిచే అవకాశం ఉన్న, గట్టి పోటీ ఇస్తున్న నియోజకవర్గాల్లోనే మోదీ ప్రచారం చేసేలా రాష్ట్ర నాయకత్వం షెడ్యూల్‌‌ ఖరారు చేసింది.

మోదీ టూర్ షెడ్యూల్..

ఈ నెల 25న మధ్యాహ్నం 1.25కు హాకీంపేట ఎయిర్ పోర్టుకు మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌‌‌‌లో 2.05 గంటలకు కామారెడ్డికి వెళ్లి, బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశర్వంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మహేశ్వరం నుంచి సాయంత్రం 5.45కు రాజ్ భవన్ చేరుకుంటారు. రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. ఈ నెల 26న రెండో రోజు రాజ్ భవన్ నుంచి ఉదయం 11.25 గంటలకు గచ్చిబౌలిలోని కన్హా శాంతి వనానికి చేరుకొని, 12.45 వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 1.35కు హెలికాప్టర్‌‌‌‌లో గజ్వేల్‌‌ నియోజకవర్గ పరిధిలోని తూఫ్రాన్‌‌ బహిరంగ సభకు హాజరవుతారు.

ఆ తర్వాత 3.45కు నిర్మల్ బహిరంగ సభకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.45కు హాకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొని, సాయంత్రం 6.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు. రాత్రి తిరుపతిలోనే మోదీ బస చేయనున్నారు. 27వ తేదీ ఉదయం 10.25 గంటల వరకు తిరుపతిలోనే ఉండనున్నారు. అక్కడి నుంచి ఉదయం 11.30కు హైదరాబాద్‌‌ హాకీంపేట ఎయిర్ పోర్టుకు మోదీ చేరుకొని, మధ్యాహ్నం 12.35కు మహబూబాబాద్‌‌ సభకు హాజరవుతారు.

తర్వాత 2.30కు కరీంనగర్‌‌‌‌ సభలో మాట్లాడి, తిరిగి 4.35కు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు హైదరాబాద్ రోడ్ షోలో పాల్గొంటారు. మరోవైపు, ఈ నెల 24, 25, 26 తేదీల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఈ నెల 24న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్, 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు నియోజకవర్గాల్లో పాల్గొననున్నారు.