తాగడానికి గుక్కెడు నీళ్లు లేవ్ 

తాగడానికి గుక్కెడు నీళ్లు లేవ్ 

మొగుళ్లపల్లి, వెలుగు: నాలుగైదు రోజుల నుంచి నీళ్లు రాక స్నానాలు చేయట్లేదని, తాగేందుకు కూడా గుక్కెడు నీళ్లు ఉంటలేవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల విద్యార్థులు ఆందోళనకు దిగారు. చిట్యాలకు వెళ్లే ప్రధాన రహదారిపై బుధవారం ఖాళీ బకెట్లతో బైఠాయించారు. ‘‘నాలుగైదు రోజుల నుంచి గురుకులానికి మిషన్​భగీరథ వాటర్​ బంద్​అయింది. స్నానాలకు నీళ్లు ఉంటలేవు. దీంతో దురద, కంతులు వచ్చి ఇబ్బందులు పడ్తున్నం. తాగేందుకు కూడా నీళ్లు ఉంటలేవు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

1,100 మంది స్టూడెంట్లు ఉన్న హాస్టల్​లో కనీసం బోరు కూడా లేదన్నారు. మిషన్​ భగీరథ కింద ఇచ్చే నీళ్లు చాలడం లేదని, ఆ నీళ్లు కూడా వరుసగా మూడు, నాలుగు రోజులు రావడం లేదని తెలిపారు. తమ సమస్యను పరిష్కరించాలని ఆఫీసర్లు, లీడర్లకు చెప్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ శ్రీధర్ .. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.